Telangana: టీఆర్ఎస్ గుండాయిజం న‌శించే కాలం ఆస‌న్న‌మైంద‌నీ.. చ‌ర్య‌కు ప్ర‌తిచ‌ర్య ఉంటుంద‌ని అధికార పార్టీ నేత‌లు గ్ర‌హించాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) చీఫ్ బండి సంజ‌య్ కుమార్ అన్నారు. త‌మ కార్య‌క‌ర్త‌ల‌ను పార్టీ కాపాడుకుంటుంద‌ని ఆయ‌న తెలిపారు.  

Bandi Sanjay: అధికార టీఆర్ఎస్ పార్టీపై భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) రాష్ట్ర చీఫ్ బండి సంజ‌య్ తీవ్ర విమ‌ర్శ‌ల‌తో రెచ్చిపోయారు. టీఆర్ఎస్ గుండాయిజం న‌శించే కాలం ఆస‌న్న‌మైందంటూ పేర్కొన్నారు. ఇటీవ‌ల చోటుచేసుకున్న ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో బెయిల్ పై విడుదలైన రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ శ్రేణులకు స్వాగతం ప‌లికిన బండి సంజ‌య్.. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల జరిగిన సంఘర్షణలో ఆ ప్రాంతానికి చెందిన దాదాపు 23 మంది భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి కరీంనగర్ జిల్లా కారాగారానికి తరలించిన విషయం తెలిసిందే. గత పది రోజులుగా రిమాండ్ లో ఉన్న రాజన్న సిరిసిల్ల బీజేపీ శ్రేణులందరికీ న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరు చేయడంతో జిల్లా కారాగారం వద్ద కరీంనగర్ బీజేపీ జిల్లా శాఖ బెయిల్ పై విడుదలైన వారికి ఘన స్వాగతం పలికింది . అనంతరం కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ బెయిల్ పై విడుదలైన రాజన్న సిరిసిల్ల నాయకులు కార్యకర్తలను సత్కరించారు. బీజేపీ శ్రేణులు ధైర్యంగా ఉండాలనీ , పార్టీ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయ‌న భరోసా ఇచ్చారు. 

అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ శ్రేణులను టార్గెట్ చేసుకుని టీఆర్ఎస్‌ గుండాలు రేచ్చి పోతున్నారనీ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో జరిగిన ఘటన కూడా అలాంటిదేనన్నారు. ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారనీ , దాదాపు 27 మందిపై అక్రమ కేసులు పెట్టి , అందులో 23 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారని పేర్కొన్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ ల అక్రమ అరెస్టుల కు బీజేపీ శ్రేణులు భయపడవ‌ని చెప్పారు. జైలు ,అరెస్టుల తో బీజేపీని అడ్డుకోవాలనుకోవడం టీఆర్ఎస్ ప్రభుత్వ మూర్ఖత్వమ‌ని మండిప‌డ్డారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో పోలీసుల సాక్షిగా జరిగిన ఈ సంఘటనలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించి, కేవలం బీజేపీ శ్రేణుల పై అక్రమ కేసులు బనాయించి అరెస్టుచేసి రిమాండ్ కు తరలించడం సరికాదన్నారు. సంఘటనలో ఎల్లారెడ్డిపేటకు చెందిన లక్ష్మారెడ్డి తీవ్ర గాయాలపాలై నడవలేని పరిస్థితిలో ఉండడం బాధాకరమన్నారు.

అధికార పార్టీ టీఆర్ఎస్ పై విమర్శలతో విరుచుకుపడ్డ బండి సంజయ్.. బీజేపీ నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకొనే బాధ్యత భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నాయకత్వంపై ఉంద‌ని తెలిపారు. బీజేపీ శ్రేణులు అధైర్య పడకుండా ముందుకు కొనసాగాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా లో అధికార పార్టీ టీఆర్ఎస్ గుండాయిజం నశించే కాలం ఆసన్నమైందని అన్నారు. చర్య కు ప్రతి చర్య తప్పదనే విషయం టీఆర్ఎస్ నాయకులు గ్రహిస్తే మంచిదన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పోలీసులు టీఆర్ఎస్‌ వేసుకున్న కార్యకర్తలలాగా పని చేస్తున్నారనే దానికి ఈ సంఘటన నిదర్శనం లాంటిదని బండి సంజ‌య్ ఆరోపించారు.