తెలంగాణ పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో ఓ విద్యార్ధిని అధికారులు ఐదేళ్ల పాటు డిబార్ చేయడాన్ని ఖండించారు బండి సంజయ్. డిబార్‌ను ఉపసంహరించుకుని అతనితో పరీక్షలు రాయించాలని ఆయన డిమాండ్ చేశారు. 

తెలంగాణ పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేయగా.. నిన్న రాత్రి ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ క్రమంలో బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పేపర్ లీక్ కేసుకు సంబంధించి కమలాపూర్ గురుకుల పాఠశాల విద్యార్ధిని ఐదేళ్ల పాటు డిబార్ చేయడాన్ని ఖండించారు. అన్ని పరీక్షలు బాగా రాసిన విద్యార్ధిని డిబార్ చేయడం తగదని.. బెదిరించి తన వద్ద పేపర్ లాక్కున్నాడని ఆ విద్యార్ధి చెబుతున్నాడని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇంత జరుగుతుంటే పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ కక్షతో విద్యార్ధి జీవితాన్ని నాశనం చేయడం తగదని.. డిబార్‌ను ఉపసంహరించుకుని అతనితో పరీక్షలు రాయించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

Also Read: నీ బిడ్డ, కొడుకు జైలుకే: జైలు నుండి విడుదలయ్యాక కేసీఆర్‌పై బండి ఫైర్

మరోవైపు బాధిత విద్యార్ధి మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయడానికి వెళితే డీఈవో పిలిచి మందలించారని వాపోయాడు. హాల్ టికెట్ తీసుకుని ఓ పత్రంపై సంతకం చేయించుకున్నారని చెప్పాడు. ఆ రోజున పరీక్ష రాస్తుంటే ఓ బాలుడు ప్రశ్నాపత్రం ఇవ్వాలని తనను బెదిరించాడని.. తాను ఇవ్వనని అన్నానని, దీంతో అతను పేపర్ లాక్కొని మొబైల్‌తో ఫోటోలు తీసుకున్నాడని చెప్పాడు. 

ఇక, పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. మంగళవారం రాత్రి బండి సంజయ్‌ను కరీంనగర్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి బొమ్మలరామారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. బండి సంజయ్‌ను బుధవారం బొమ్మలరామారం నుంచి వరంగల్‌కు తరలించారు. ఆయనను బుధవారం సాయంత్రం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో సంజయ్‌ను నిన్న రాత్రి కరీంనగర్ జైలుకు తరలించారు. ఇక, ఈ కేసులో బండి సంజయ్‌ను ఏ-1గా పేర్కొన్న పోలీసులు.. ఆయనపై ప్రధాన కుట్రదారు అని అభియోగం మోపారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి బండి సంజయ్‌కు హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.