Pocharam Srinivas Reddy: చంద్రబాబు అరెస్టుపై పోచారం సంచలన వ్యాఖ్య .. ఏమన్నారంటే..?
Pocharam Srinivas Reddy: స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావటంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు అరెస్టును అప్రజాస్వామికమని, ఆ అరెస్టును వ్యతిరేఖించారు.

Pocharam Srinivas Reddy: స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగుతోంది. అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్టు పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా స్పందించారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని, ప్రజాస్వామ్యంలో రాజకీయ కక్షలు మంచివి కావని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న వారు అకారణం ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి జైల్లో పెట్టడం సరికాదని అన్నారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
బీర్కూరు మండలంలో శుక్రవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలల్లో ముఖ్య అతిధిగా స్పీకర్ పోచారం పాల్గొన్నారు. బైరపూర్ లో నిర్మించిన 42 డబుల్ బెడ్ రూం ఇండ్లను, రూ.25 లక్షలతో నిర్మించిన యాదవ సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి స్వంత ఇళ్ళు ఉండాలన్నదే తన ఆశయమని అన్నారు. పేదవారు ఏ పార్టీ అయినా డబుల్ బెడ్ రూం ఇంటిని మంజూరు చేశానని… అంతే కానీ దొంగల పాలు చేయలేదని స్పష్టం చేశారు.
తెలంగాణలోనే కాదు దేశంలోనే బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గానికి అత్యధికంగా 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరయ్యాయని, ఇంకా ఎవరైనా ఇల్లు లేని వారు స్వంత స్థలం ఉండి, స్వంతంగా ఇళ్ళు కట్టుకుంటే గృహలక్ష్మి పథకం కింద సహయం చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో కేసీఆర్ లా 28 మంది ముఖ్యమంత్రులు ఉన్నారని.. కానీ, ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం లేదని అన్నారు.
అవినీతికి పాల్పడిన డబ్బులతో ఎన్నికలలో ఓట్లు కొనడానికి నాయకులు వస్తారని, అలాంటి నాయకులను గట్టిగా నిలదీయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజలను పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్ళు నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వస్తున్నాయని, భవిష్యత్తులో తాగు, సాగునీటికి ఎలాంటి కొరత ఉండదని అన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన అన్ని పనులను మంజూరు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.