తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నేటి ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో తగు జాగ్రత్తలను తీసుకున్నారు. ప్రతి సీటును ఒక్కరికి మాత్రమే కేటాయించి... ఫీజికల్ డిస్టెంసింగ్ పాటిస్తూ.... సభ్యులకు సీట్ల ఏర్పాటును చేసారు. 

సభలోనే కాకుండా సభ ప్రాంగణం బయట కూడా భౌతిక దూరం నియమాన్ని ఖచ్చితంగా  అమలు చేస్తున్నారు. సభ్యులు,   ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేసారు. 

ముఖ్యమంత్రి, ప్రతిపక్షం, స్పీకర్ అన్న తేడా లేకుండా కరోనా నెగటివ్ వచ్చిన వారిని మాత్రమే సభలోకి అనుమతించారు. సభ ప్రారంభమవగాన్ స్పీకర్ పోచారం కోవిడ్ మార్గదర్శకాలను చదివి వినిపించారు. 

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ రాష్ట్రపతి, భారత రత్న ప్రణబ్‌ ముఖర్జీ మృతికి తెలంగాణ ప్రజల తరపున సంతాపం ప్రకటించారు. తెలంగాణతో ప్రణబ్ దాకు అవినాభావ సంబంధం ఉందని, రాజకీయంగా ఎన్నో పదవులు చేపట్టిన ప్రణబ్‌ వాటికి వన్నె తెచ్చారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆయన మరణం వల్ల దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని కేసీఆర్ సంతాపం తెలిపారు. 

కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఈ సంతాప తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారని, ఆయన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు సభ్యులు. అప్పటి ప్రణబ్ కమిటీకి అందించిన లేఖలు, ఆయన వ్యవహరించిన తీరును సభ్యులు కొనియాడారు.