Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీలో రిపోర్టర్ల కష్టాలు

  • అవమానభారం మోస్తున్న అసెంబ్లీ రిపోర్టర్లు
Telangana assembly reporters suffer from lack of growth in profession

తెలంగాణ అసెంబ్లీలో పనిచేస్తున్న రిపోర్టర్ల కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు. ఈ రిపోర్టర్ల బతుకులు 25 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉన్నాయి. తమకు మేలు చేసే మహానుభావులు ఎవరున్నారా అని ఆ రిపోర్టర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అసెంబ్లీలో కనబడిన నాయకుడిని వేడుకుంటున్నారు. ఇంతకూ అసెంబ్లీ రిపోర్టర్ల కష్టాలేంటబ్బా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి.

తెలంగాణ అసెంబ్లీలో 24 మంది రిపోర్టర్లు పనిచేస్తున్నారు. వీరంతా గ్రూప్ 1 గెజిటెడ్ హోదా కలిగిన వారు. అయితే గత 25 ఏళ్లుగా వీరు పదోన్నతులు లేక అవస్థలు పడుతున్నారు. వీరికి పదోన్నతుల విషయంలో తీరని అన్యాయం జరుగుతున్నది. ఈ ఉద్యోగులకు క్యాడర్ స్ట్ర్రెంత్ ప్రకారం కాకుండా లాబీయింకే చేసేవారికే  ప్రమోషన్లు ఇస్తున్నారంటు రిపోర్టర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి సమస్యలను ఒకసారి చూద్దాం.

Telangana assembly reporters suffer from lack of growth in profession

గ్రూప్ వన్ కేడర్ లో గెజిటెడ్ హోదాలో పనిచేస్తున్నారు అసెంబ్లీ రిపోర్టర్లు. షార్ట్ హ్యాండ్ హైస్పీడ్ (Shorthand High Speed Qualification) పాసవడంతోపాటు పిజి, ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం వంటి ఉన్నతమైన విద్యార్హతలు కలిగి చట్ట సభలలో చట్టాలు రూపొందించే కార్యక్రములో వీరు భాగస్వాములవుతున్నారు. అలాగే అసెంబ్లీ కమిటీ వ్యవస్థలో, వాటి రాష్ట్ర మరియు దేశ పర్యటనలలో పాలుపంచుకుంటూ, విశేష సేవలందిస్తున్నారు. అయినా.. రెండున్నర దశాబ్దాల పైగా తమకు ఎలాంటి పదోన్నతి లేదని ఆవేదన చెందుతున్నారు. 1952వ సంవత్సరంలో రూపొందించబడిన హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ రూల్స్ ప్రకారం రిపోర్టర్లు మరియు సెక్షన్ ఆఫీసర్లకు 1:1 ప్రాతిపదికన అసిస్టెంట్ సెక్రటరీగా పదోన్నతి లభించేది. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ రూల్స్‌ని పాటిస్తూ 1:1 విధానం ప్రకారం రిపోర్టర్లకి మరియు సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీ పదోన్నతులు 1979 వరకు కూడా నిరాటంకంగా 27 ఏళ్ల పాటు అమలులో ఉండేది.

అయితే 1979లో అప్పటి  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్ల క్యాడర్ స్ట్రెంత్ ఎక్కువగా ఉందనే నెపంతో 1:1 రేషియో ను కాస్తా...  3:1 రేషియోగా మార్చి (సెక్షన్ ఆఫీసర్లకి 3 అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులు, రిపోర్టర్లకి కేవలం ఒకే ఒక్క అసిస్టెంట్ సెక్రటరీ పోస్టును కేటాయిస్తూ ) G.O.Ms.No.82ని 1979లో జారీ చేశారు. ఈ జిఓ ద్వారా రిపోర్టర్లకు తీవ్ర అన్యాయం చేశారని రిపోర్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రు. G.O.Ms.No.82ని హైకోర్టులో రిపోర్టర్లు ఛాలెంజ్ చేయగా, సదరు జి.ఓ.ని హైకోర్టు కొట్టివేసింది. మళ్లీ దానిపైన డిపార్టుమెంటు సుప్రీంకోర్టుకి అప్పీల్‌కి వెళ్లినప్పటికీ, 15 సంవత్సరాల అనంతరం డిపార్ట్‌మెంట్ అప్పీల్‌ని కొట్టివేయడం జరిగిందని చెబుతున్నారు.  అయినప్పటికీ,  డిపార్టుమెంట్ వారు మరో కొత్త .G.O.Ms.No 66ని 1983ని జారీ చేసి క్యాడర్ స్ట్రెంత్ విధానంకు తూట్లు పోడిచి అదే  3ః1 రేషియోని విధానాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుపై రిపోర్టర్ల ఆగ్రహం

ప్రస్తుత అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేస్తున్ననర్సింహ్మాచార్యులు తీరు మీద రిపోర్టర్లు ఆగ్రహంగా ఉన్నారు. ఆయన 1993లో నాన్‌గెజిటెడ్ పోస్టు అయిన రిసెర్చి ఆఫీసర్‌గా జాయిన్ అయినాడని రిపోర్టర్లు చెబుతున్నారు. తరువాత 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సిఎం పేషీలో అడిషనల్ పి.ఎస్.గా చేరారని తెలిపారు. అక్కడ తన పొజిషన్‌ని ఉపయోగించుకుని అప్పటి అసెంబ్లీ స్పీకర్ మరియు సెక్రటరీలను ఇన్‌ఫ్లుయన్స్ చేసి, గెజిటెడ్ ఆఫీసర్‌గా, అడ్డదారిన ప్రమోషన్ పొందాడని అసెంబ్లీ రిపోర్టర్లు ఆరోపిస్తున్నారు.  అక్కడితో ఆగకుండా, అసెంబ్లీ సెక్రటరీ స్థాయికి వెళ్లాలనే లక్ష్యంతో, 2007లో అదే రీతిగా తనకు అనుకూలంగా రూల్స్ ను అమెండ్‌చేయించుకున్నారని ఆరోపించారు. రిపోర్టర్ల కేటగిరికీ అన్యాయం చేస్తూ జీవో ఎం.ఎస్ నెంబ.52, తేది 26-10-2007 ద్వారా  అసిస్టెంట్ సెక్రటరీగా ప్రమోషన్ పొందారని ఆరోపించారు. ఆ తరువాత డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ప్రమోషన్లు పొంది తుదకు అసెంబ్లీ కార్యదర్శిగా అయ్యారని చెబుతున్నారు. ఆయన పదేళ్ల కాలంలోనే 5 ప్రమోషన్లు పొందితే... గెజిటెడ్ హోదాలో ఉద్యోగంలో జాయిన్ అయిన తాము 25 ఏళ్లుగా ఒక్క ప్రమోషన్ లేకుండా పనిచేస్తున్నామని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని వారు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ, 1979లో ఆంధ్ర అసెంబ్లీ అధికారులు రూపొందించిన 3:1 రేషియోకి ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ అధికారులు కూడా వత్తాసు పలుకుతూ  అదే 3:1 రేషియో అమలు చేస్తూ  గత 34 సంవత్సరాల నుండి జరుగుతున్న అన్యాయాన్ని కొనసాగిస్తున్నారని రిపోర్టర్లు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీలో అసిస్టెంట్ సెక్రటరీ పదోన్నతుల విషయంలో, ఎక్కడా లేని 3:1 రెషియో విధానం అమలు చేయడం వలన, రిపోర్టర్స్ 25 సంవత్సరాలు సర్వీస్ పుటప్ చేసినా, వారికి ఎలాంటి పదోన్నతులు లేకపోయాయని అంటున్నారు. కానీ ఇదే రేషియో ప్రకారం క్రింది స్థాయి ఉద్యోగులు అయిన (అటెండర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, టైపిస్టులు, టెలిఫోన్ ఆపరేటర్లు, జీరాక్ష్ ఆపరేటర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు ఎఎస్ ఓలు 20 ఏళ్లలో 4నుంచి 5 ప్రమోషన్లు పొంది అసిస్టెంట్ సెక్రటరీ మరియు ఆపై స్థాయికి చేరుతున్నారని అంటున్నారు. దీంతో గ్రూప్ 1 కేడర్ లో ఉద్యోగంలోకి వచ్చిన తాము వీరి కింద పని చేయాల్సిన దుస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత 34 సంవత్సరాల నుండి  అసెంబ్లీ రిపోర్టర్లకు  ప్రమోషన్ల విషయంలో  జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దవలసిందిగా కోరుతూ సిఎం కేసిఆర్,  ఛీఫ్ సెక్రటరీ,  కౌన్సిల్ ఛైర్మన్‌,  అసెంబ్లీ స్పీకర్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి కి, అసెంబ్లీ సెక్రటరీ కి అసెంబ్లీ గెజిటెడ్ రిపోర్టర్స్ అసోసియేషన్ తరుపున అనేకసార్లు విన్నవించినా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన చెందుతున్నారు. శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి అందుకు సానుకూలంగా స్పందించి, ఫైల్ కాల్‌ఫర్ చేస్తూ, అసెంబ్లీ సెక్రటరీకి నోట్ పంపడం జరిగిందని, అయినా ఎలాంటి పురోగతి లేదని చెబుతున్నారు. పాత పద్దతిలోనే ప్రమోషన్ల ప్రక్రియను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితులలో తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్న స్టెనోగ్రఫీ కళ (Stenography art)  పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. అసెంబ్లీ సిబ్బంది విభజన తరువాత సెక్షన్ ఆఫీసర్ల కేడర్ స్ట్రెంత్ 13 కాగా, రిపోర్టర్లు, ఇతర క్యాడర్ స్ట్రెంత్ ను 32గా నిర్ధారించారని తెలిపారు. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిమెంట్ల ప్రకారం  గెజిటెడ్ హోదాలో పనిచేస్తున్న తమకు మార్పులు చేర్పులు చేసి పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి

కెనడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వ్యక్తి మృతి

పాలమూరులో ఈతకు వెళ్లి ఇద్దరు పోరగాళ్లు మృతి

ఒగ్గు కళా దిగ్గజం చుక్కా సత్తయ్య కన్నుమూత

https://goo.gl/KywP1D

Follow Us:
Download App:
  • android
  • ios