నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. సోమవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే మంత్రి కేటీఆర్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరిన విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు.

పర్యావరణానికి, జీవావరణానికి, ప్రకృతి రమణీయతకు నెలవైన నల్లమలలో యురేనియం నిక్షేపాలను వెలికి తీయడం కోసం తవ్వకాలు జరపాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని తెలంగాణ శాసనసభ కోరుతోందన్నారు.

పెద్ద పులలు, చిరుత పులులు, చుక్క జింకలు, దుప్పులు, ఎలుగు బంట్లు సహా అనేక జాతులకు చెందిన జంతుజాలం నల్లమలను ఆధారంగా చేసుకుని మనుగడ సాగిస్తున్నాయన్నారు.

అరుదైన ఔషద మొక్కలతో పాటు లక్షలాది వృక్షజాలంతో పాటు అనాదిగా అడవిని ఆధారంగా చేసుకుని చెంచులు, తదితర జాతులు ప్రజలు జీవిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

జీవవైవిధ్యానికి నెలవైన నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం కోసం తవ్వకాలు జరపడం వల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతినే ప్రమాదముందన్నారు.

యురేనియం వల్లే వెలువడే అణు ధార్మికత వల్ల పంటలు పండే భూమి, వీచే గాలి, తాగేనీరు కాలుష్యమై మనిషి జీవితం నరకప్రాయమయ్యే అవకాశం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అభివృద్ది చెందిన దేశాల్లో సైతం యురేనియం తవ్వకాలకు సంబంధించిన అనుభవాలు సైతం చేదుగానే ఉన్నాయన్నారు.

తెలంగాణ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని... రాష్ట్ర శాసనసభ సైతం జనం ఆందోళనతో ఏకీభవిస్తుందన్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపాలనే ఆలోచనను విరమించుకోవాలని కేంద్రాన్ని శాసనసభ కోరుతోందన్నారు. 

యురేనియం తవ్వకాలకు అనుమతివ్వం: అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్

యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు: తేల్చేసిన కేటీఆర్