Asianet News TeluguAsianet News Telugu

Telangana Assembly Exit Poll: 'కమలం'లో కలవరం.! ఇక సింగిల్ డిజిట్ కే పరిమితమా? 

Telangana Assembly Exit Poll Results 2023:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. అందరి ద్రుష్టి ఫలితాల మీద పడింది. అంతకంటే ముందు  ఓటింగ్ ముగియగానే వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఈ తరుణంలో ఒకనొక సమయంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన కాషాయ పార్టీ పరిస్థితి నేడు రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. 

Telangana Assembly Exit Poll Results 2023 Is BJP limited to single digits? KRJ
Author
First Published Dec 1, 2023, 12:11 PM IST

Telangana Assembly Exit Poll Results 2023: ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు అందరి ద్రుష్టి ఫలితాల మీదే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఇంతకీ నెక్స్ సీఎం ఎవరు? అనే అంశాలపైనే రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఓటింగ్ ముగియగానే వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి.

అధికార బీఆర్ఎస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. దాదాపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారా? లేదా ప్రతిపక్షానికే పరిమితం కావాలా? అనే పలు సందేహాలకు సమాధానాలు  దొరకాలంటే..?  డిసెంబర్ 3 ( ఆదివారం) వరకు వేచి చూడాల్సిందే. ఈ పదేండ్లు ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్.. అధికార పగ్గాలను హస్తగతం కానున్నడంతో ఆ పార్టీ నేతలంతా ఫుల్ జోష్‌లో ఉన్నారు. 

కానీ, ఈ ఫలితాల అనంతరం బీజేపీ పరిస్తితి దారుణంగా ఉంది.ఒకప్పుడూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన కాషాయ పార్టీ పరిస్థితి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. ఎన్నికల ముందు జోరు మీద ఉన్న కమలం పార్టీ .. తీరా ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు వెలువడే నాటికి సీన్ రివర్స్ అయింది. ఆ పార్టీ అంచనాలన్నీ తారుమారయ్యాయి. పెట్టుకున్న ఆశలు  ఆవిరయ్యాయి.  

దక్షిణాది రాష్ట్రాల్లో అధిపత్యం చెలాయించాలని భావించిన బీజేపీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు తగినట్టుగానే కసరత్తులు చేసింది. కానీ కర్ణాటకలో కమలం వాడిపోయింది. సరేలే చేసేదేం లేదు .. ఇక తెలంగాణ లోనైనా పట్టు సాధించాలని వ్యూహా రచన చేసింది. ఈ తరుణంలో బీజేపీ అధిష్టాన నేతలు తరుచు  తెలంగాణ గడ్డపై కాలు పెట్టడం. వీలు దొరికినప్పుడల్లా.. పర్యటనలు.. భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ.. పార్టీ కేడర్ లో కూడా జోష్ పెంచింది. ఈ క్రమంలో తెలంగాణంలో అధికారంలోకి వస్తామని, బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని బాహాటంగానే ప్రకటించారు. ఈ మేరకు తీవ్ర కసరత్తు చేసింది కమలం పార్టీ.

కానీ, ఎన్నికల తరువాత వెలువడిన ఎగ్జిట్‌పోల్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. బీజేపీ నాయకులు,కార్యర్తలు కలలు కలలుగా మారాయి. ఎవరూ ఊహించని విధంగా బీజేపీకి గరిష్టంగా 10 సీట్లు మాత్రమే వస్తాయని పలు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ షాక్ ఇవ్వడంతో కాషాయ నేతలంతా కలవరం చెందుతున్నారు. ఏం  చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారు. మరోవైపు.. ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలపై ఆ పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు ఫైనల్ ఫలితాలమేమి కాదనీ, వాటిని నమ్మల్సిన అవసరం లేదని అంటున్నారు.

ఈ సారీ భారీ మెజారిటీతో తాము గెలుస్తామన్న నమ్మకం తమకుందని,  ఈ ఎన్నికల్లో తమకు అనుకూల ఫలితాలు వచ్చాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ బండి సంజయ్ స్పందిస్తూ.. బీజేపీని గెలిపించాలన్న కసితో ప్రజలంతా ఏకమయ్యారని, తమకు మెజార్టీ స్థానాలు వస్తాయని దీమా వ్యక్తం చేశారు. కానీ, ఎగ్జిట్ పోల్స్ ని ఇప్పుడే విశ్వసించలేమని అన్నారు. హంగ్ వచ్చే అవకాశాలు కూడా లేకపోదని అన్నారు. తాము 60, 70 స్థానాలు గెలుస్తామని ఎప్పుడూ భావించలేదనీ, బీజేపీకి 25నుంచి 30 స్థానాలు వస్తాయన్నారు. కానీ, తాము  మాత్రం ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్‌తో కలిసేది లేదని ఈటల తేల్చి చెప్పారు

ఇక మరికొందరు నేతలు మాత్రం గతంతో పోల్చుకుంటే.. బీజేపీ స్థితి చాలా మెరుగుపడిందనీ, ఓటుబ్యాంకు శాతం కూడా చాలా పెరిగిందని భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితమైన బీజేపీ.. ఆ తరువాత జరిగిన ఉపఎన్నికల్లో మరో రెండు స్థానాలను గెలుపొందింది. దీంతో వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ ఎన్నికల్లో గత ఎన్నికల కంటే.. ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడం తమకి కలిసివచ్చిన అంశంగా భావిస్తున్నారు.

అంతేకాకుండా.. అసలు ఏమాత్రం ఉనికిలేని స్థానాల్లోనూ తమ పార్టీ ఓటు బ్యాంక్ పెరగడం కూడా తమకు ప్లస్ పాయింటేనని భావిస్తున్నారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలు చాలా బెటర్ అని ఫీలవవుతున్నారు.  ఇదిలా ఉండగా నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని సీట్లు వచ్చినా అధికారం బీజేపీదేనని బాహటంగానే పలువురు నేతలు ప్రకటించారు. ఇలాంటి వ్యాఖ్యల వెనుక  అంతర్యమేమిటో ప్రశ్నార్థకమే. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే.. ఈ నెల 3వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios