కాంగ్రెస్‌లో చేరికలు: సీపీఐతో సీట్ల సర్ధుబాటుపై ఎఫెక్ట్, పొత్తుంటుందా?
కాంగ్రెస్ లో చేరికలు సీపీఐతో సీట్ల సర్ధుబాటుపై ప్రభావం చూపే అవకాశం కన్పిస్తుంది. కాంగ్రెస్ తో సీట్ల సర్ధుబాటు కుదరకపోతే ఒంటరిగా పోటీ చేయాలని లెఫ్ట్ పార్టీలు భావిస్తున్నాయి.
హైదరాబాద్: ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు పొత్తుపై ప్రభావం చూపే అవకాశం కన్పిస్తుంది. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరారు.కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో జలగం వెంకటరావు చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ నేతలు జలగం వెంకటరావుతో టచ్ లోకి వెళ్లారని సమాచారం.దీంతో సీపీఐకి కేటాయించే రెండు సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ నాయకత్వం ఏం చేస్తుందోననే చర్చ సాగుతుంది.
పొత్తులో భాగంగా సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు అసెంబ్లీ స్థానాలను కేటాయించేందుకు కాంగ్రెస్ సంసిద్దతను వ్యక్తం చేసింది. చెన్నూరుకు బదులుగా మునుగోడు అసెంబ్లీ సీటు కోసం నల్గొండ జిల్లాకు చెందిన నేతలు పట్టుబట్టారు. అయితే మునుగోడు సీటు విషయంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు కూడ జరిపారు. వ్యూహత్మకంగానే మునుగోడు సీటును సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. బీజేపీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. దీంతో మునుగోడు టిక్కెట్టును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ కేటాయించింది. కొత్తగూడెం,చెన్నూరు సీట్లు తమకు ఇస్తారని సీపీఐ ఆశతో ఉంది.
అయితే కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. కొత్తగూడెం టిక్కెట్టు వెంకటరావుకే వస్తుందని ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. మరో వైపు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఆయన తనయుడు వంశీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీని చెన్నూరు అసెంబ్లీ నుండి బరిలోకి దింపాలని వెంకటస్వామి భావిస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. అదే జరిగితే చెన్నూరు సీటు కూడ సీపీఐకి కేటాయించే అవకాశం ఉండదు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇవాళ హైద్రాబాద్ లో జరిగింది. కాంగ్రెస్ తో పొత్తు అంశంతో పాటు కాంగ్రెస్ లో చేరికలతో పొత్తుపై ప్రభావం పై కూడ చర్చించారు. సీట్ల సర్ధుబాటుపై కాంగ్రెస్ నుండి మార్పులు, చేర్పుల గురించి తమకు ఇంకా ఎలాంటి సమాచారం లేదని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ రెండు జాబితాలను ప్రకటించింది. రెండు జాబితాల్లో 100 సీట్లలో అభ్యర్థులను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇంకా 19 స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇతర పార్టీల నుండి చేరే అభ్యర్థుల కోసం ఈ జాబితాను ప్రకటించలేదనే చర్చ కూడ లేకపోలేదు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు అవసరం లేదనే అభిప్రాయంతో కొందరు నేతలున్నారనే ప్రచారం కూడ సాగుతుంది.
also read:పొత్తా, చిత్తా: కాంగ్రెస్‌తో పొత్తుపై తేల్చనున్న సీపీఎం రాష్ట్ర కమిటీ
ఇదిలా ఉంటే సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇవాళ ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. కాంగ్రెస్ తో పొత్తుపై ఆ పార్టీ చర్చించింది. కాంగ్రెస్ తో పొత్తు తేలకపోతే సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ రెండు పార్టీలు 40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది.