పొత్తా, చిత్తా: కాంగ్రెస్‌తో పొత్తుపై తేల్చనున్న సీపీఎం రాష్ట్ర కమిటీ

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ  సమావేశం  ఇవాళ జరగనుంది. ఈ సమావేశంలో  కాంగ్రెస్ తో సీట్ల సర్ధుబాటుపై  సీపీఎం స్పష్టత ఇవ్వనుంది

Telangana assembly Elections 2023:  CPM Telangana State Committee Meet Today lns

హైదరాబాద్: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం  బుధవారంనాడు  హైద్రాబాద్ లో జరుగుతుంది.  కాంగ్రెస్ తో పొత్తుపై  ఈ సమావేశంలో  సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకోనుంది.

సీట్ల సర్ధుబాటు విషయమై  కాంగ్రెస్ పార్టీ తీరుపై సీపీఎం రాష్ట్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది.  ఈ విషయమై  సీపీఎం ఇచ్చిన డెడ్ లైన్ కూడ పూర్తైంది. దీంతో ఇవాళ జరిగే సీపీఎం రాష్ట్ర కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మిర్యాలగూడ, వైరా అసెంబ్లీ స్థానాల కేటాయింపు విషయమై కాంగ్రెస్ పార్టీ నుండి తమకు  స్పష్టత లేదని  సీపీఎం  రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని  వీరభద్రం రెండు రోజుల క్రితం ప్రకటించారు.  పొత్తు విషయమై  కాంగ్రెస్ పార్టీ నుండి  ఆదర్శమైన మాటలు చెబుతున్నా ఆచరణ అందుకు విరుద్దంగా ఉందని  తమ్మినేని వీరభద్రం విమర్శలు గుప్పించారు.  మిర్యాలగూడతో పాటు  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఒక అసెంబ్లీ సీటును తమకు కేటాయించాలని సీపీఎం పట్టుబడుతుంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం వద్ద సీపీఎం  పట్టుబట్టింది. పాలేరు అసెంబ్లీ సీటును  ఇవ్వలేమని  కాంగ్రెస్ నాయకత్వం తేల్చి చెప్పింది. అయితే  పాలేరు కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మరో అసెంబ్లీ సీటును  ఇవ్వాలని సీపీఎం ప్రతిపాదించింది.  ఖమ్మం జిల్లాలోని వైరా అసెంబ్లీ సీటును  ఇవ్వాలని సీపీఎం కోరింది. అయితే వైరాలో  కాంగ్రెస్ అభ్యర్ధి బరిలో ఉంటారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ప్రకటించారు. మరో వైపు  వైరా అసెంబ్లీ స్థానం తీసుకొనేందుకు  సీపీఎం సిద్దంగా లేదని  కాంగ్రెస్ నేతలు  ప్రచారం చేశారని సీపీఎం నేతలు గుర్తు చేస్తున్నారు. 

మరో వైపు హైద్రాబాద్ పాతబస్తీలోని ఓ అసెంబ్లీ సీటుతో పాటు   అధికారంలోకి వస్తే  ఎమ్మెల్సీ  సీటును ఇస్తామనే ప్రతిపాదనను సీపీఎం ముందు కాంగ్రెస్ పెట్టింది.ఈ ప్రతిపాదనలపై  సీపీఎం  సానుకూలంగా స్పందించలేదు.దీంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం సీపీఎం  జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో కూడ ఈ విషయమై  చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. 

ఇదిలా ఉంటే  మిర్యాలగూడ, వైరా అసెంబ్లీ స్థానాలు తమకు కేటాయిస్తే  పొత్తుకు సానుకూలంగా ఉంటామని కాంగ్రెస్ కు  సీపీఎం సంకేతాలు పంపింది.  ఈ విషయమై  రెండు రోజుల గడువు పెట్టింది.  ఈ గడువు ముగిసింది.ఇవాళ  సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం  పొత్తులపై  కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

also read:ఎల్లుండిలోపుగా సీట్ల సర్ధుబాటుపై తేల్చండి: కాంగ్రెస్‌కు తమ్మినేని అల్టిమేటం

ఇదిలా ఉంటే  సీపీఎంతో పొత్తు విషయం తేలనందున  సీపీఐకి సీట్ల సర్ధుబాటు విషయమై  కాంగ్రెస్ నుండి స్పష్టత రాలేదు.  ఈ విషయాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి  నారాయణ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios