కలిసి పోటీకి లెఫ్ట్ పార్టీల నిర్ణయం: ఈ నెల 27 తర్వాత మరోసారి భేటీ
సీపీఐ, సీపీఎం నేతలు ఇవాళ సమావేశమయ్యారు. ఈ నెల 27వ తేదీ తర్వాత మరోసారి ఈ రెండు పార్టీల నేతలు సమావేశం కానున్నారు.
హైదరాబాద్: సీపీఐ, సీపీఎం నేతలు హైద్రాబాద్ లో మంగళవారంనాడు సమావేశమయ్యారు. హైద్రాబాద్ సీపీఐ కార్యాలయానికి సీపీఎం నేతలు వచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం నేతలు చరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డిలు సీపీఐ నేతలతో సమావేశమయ్యారు. ఇవాళ ఉదయం సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. అదే సమయంలో సీపీఐ కార్యాలయంలో సీపీఐ నేతలు భేటీ అయ్యారు.
వేర్వేరుగా తమ కార్యాలయాల్లో సమావేశాలు ముగించుకున్న తర్వాత రెండు పార్టీల నేతలు సమావేశమయ్యారు. రెండు పార్టీలు రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ విషయమై రేపు సీపీఐ రాష్ట్ర కార్యవర్గంలో, ఈ నెల 27న సీపీఎం రాష్ట్ర కార్యవర్గంలో చర్చించనున్నారు. ఈ నెల 27వ తేదీ తర్వాత రెండు పార్టీల నేతలు మరోసారి భేటీ కానున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న 115 అభ్యర్థులతో జాబితాను విడుదల చేశారు. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ పరిణామంతో లెఫ్ట్ పార్టీలు షాక్ కు గురయ్యాయి. బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందని భావించారు. అయితే 115 అభ్యర్థుల జాబితా ప్రకటనతో లెఫ్ట్ పార్టీలతో పొత్తు లేదని తేలింది . దీంతో ఇవాళ సీపీఐ, సీపీఎం నేతలు సమావేశమయ్యారు.
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి. వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలకు ఒక్కో అసెంబ్లీ సీటు కేటాయించనున్నట్టుగా బీఆర్ఎస్ నుండి ప్రతిపాదన వచ్చింది. అయితే ఈ విషయమై కేసీఆర్ తో చర్చలకు లెఫ్ట్ పార్టీలు ప్రతిపాదించాయి. కానీ, ఈ సమావేశం జరగలేదు. బీఆర్ఎస్ నాయకత్వం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దీంతో లెఫ్ట్ పార్టీల నేతలు ఇవాళ సమావేశమయ్యారు.