తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ.. వామపక్షాలతో పొత్తు కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మునుగోడు ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్‌తో జట్టు కట్టిన వామపక్షాలు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీతో కలిసి ముందుకు సాగాలని భావించారు. అయితే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పటికే ఏకపక్షంగా 115 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో వామపక్షాల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అయితే రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడమా?, కలిసివచ్చే పార్టీలతో ముందుకు సాగడమా? అనే డైలామాలో ఆ పార్టీలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ.. వామపక్షాలతో పొత్తు కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా సమాచారం. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే.. ఇప్పటికే రాష్ట్రంలోని సీపీఎం, సీపీఐ ముఖ్య నేతలకు ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల మద్దతు కోరినట్టుగా సమాచారం. అయితే ఈ సంభాషణలో సీట్ల సర్దుబాటు విషయం ఇంకా ప్రస్తావనకు రాలేదని.. చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని తెలుస్తోంది.
ఇదిలాఉంటే, గతంలో 2018 అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో కూడా సీపీఐ భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో సీపీఎం మాత్రం ఒంటరిగా బరిలో దిగింది. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఇరు పార్టీలు కూడా ఉమ్మడిగా ముందుకు సాగాలని భావిస్తున్నట్టుగా సమాచారం. రెండు పార్టీలు కలిసి.. ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదా ఆ రెండు పార్టీలు మాత్రం జట్టుగా ఉమ్మడిగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
నేడు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం..
ఈరోజు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది. రానున్న ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వైఖరి, రాజకీయ ఎత్తుగడలు, తదితర అంశాలపై చర్చించనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు కేంద్ర కమిటీ నుంచి పొలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్, బీవీ రాఘవులు కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌తో సీపీఎం పొత్తుకు సంబంధించి కొంతమేర స్పష్టత వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది.
