Telangana Assembly Elections 2023 : జనసేనకు బిజెపి కేటాయించిన సీట్లివే?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షం జనసేనకు బిజెపి 8 సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇలా జనసేన పోటీచేసే ఎనిమిది నియోజకవర్గాలేవో ఇప్పటికే ఇరుపార్టీలు క్లారిటీ వచ్చినట్లు... ప్రకటనే తరువాయి అని రాజకీయ ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే అధికార బిఆర్ఎస్ ఒంటరిగానే పోటీకి సిద్దమవగా ప్రతిపక్ష కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో బిజెపి కూడా జనసేన పార్టీతో కలిసి వెళ్లేందుకు సిద్దమయ్యింది. కాపు సామాజికవర్గంతో ఆంధ్రా సెటిలర్లను టార్గెట్ చేసిన బిజెపి ఎన్డీయేలో కొనసాగుతున్న జనసేనను రంగంలోకి దింపింది. అంతేకాదు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు యువతలో వున్న ఫాలోయింగ్ ఓట్లుగా మలచుకోవాలని బిజెపి భావిస్తోంది. దీంతో ఇప్పటికే పలుమార్లు బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి జనసేనాని పవన్ కల్యాణ్ తో సమావేశమై తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై చర్చించారు. ఇప్పటికే ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దుపాటు కూడా జరిగిపోయినట్లు తెలుస్తోంది.
తాజాగా హైదరాబాద్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. ఇందులో బిజెపి, జనసేన పార్టీలు ఏయే స్థానాల్లో పోటీచేయాలన్నదానిపై ఇరువురు నాయకులు చర్చించుకున్నారు. చివరకు ఇరుపార్టీలో ఓ అవగాహనకు వచ్చి 8 స్థానాల్లో జనసేన, మిగతా చోట్ల బిజెపి పోటీచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారు, కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా వున్న నియోజకవర్గాలను జనసేనకు కేటాయించడానికి బిజెపి సమ్మతించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సీట్ల సర్దుపాటు తుదిదశకు చేరుకుందని... ఓ రెండు సీట్ల విషయంలో ఇరుపార్టీల మధ్య చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. వాటిపై ఓ అవగాహనకు వచ్చాక బిజెపి, జనసేన ఏయే నియోజకవర్గాల్లో పోటీచేయనున్నాయో తేలనుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల ప్రభావం ఎక్కువగా వుండే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే జనసేనకు బిజెపి అధిక సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.
Read More తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్... జనసేన పోటీచేసే సీట్లెన్నంటే...
ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలను బిజెపి జనసేనను కేటాయించినట్లు తెలుస్తోంది. అలాగే నాగర్ కర్నూల్, తాండూరు, కోదాడ నియోజకవర్గాల్లో పోటీకి జనసేన ఆసక్తి చూపిస్తోందట. ఇక ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారు ఎక్కువగా వుండే కూకట్ పల్లిలో కూడా జనసేన పోటీలో నిలవనుందని సమాచారం. ఇలా మొత్తం 8 సీట్లను బిజెపి జనసేనకు కేటాయించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
ఇలా కేవలం జనసేనను బరిలోకి దింపడమే కాదు పవన్ కల్యాణ్ ను ప్రచారంలో వాడుకోవాలని బిజెపి ప్లాన్ వేస్తోందట. ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రచారంపై ఇరుపార్టీల మధ్య చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 7న అంటే మరో రెండ్రోజుల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారని బిజెపి నాయకులు చెబుతున్నారు. ఆ తర్వాత కూడా పవన్ తెలంగాణలో ప్రచారం చేపట్టనున్నారని తెలంగాణ బిజెపి,జనసేన నాయకులు చెబుతున్నారు.