తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్... జనసేన పోటీచేసే సీట్లెన్నంటే...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీకి సిద్దమైన బిజెపి, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా పూర్తయ్యింది. తాజాగా జనసేనాని పవన్, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమై దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
pawan kalyan
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహప్రతివ్యూహాలతో ముందుకు వెళుతుండటంతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయ పార్టీలన్ని ప్రచార జోరు పెంచాయి. ఇప్పటికే బిఆర్ఎస్ తరపున కేసీఆర్... కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వంటివారు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ విషయంలో బిజెపి కాస్త వెనకబడిందనే చెప్పాలి. అయితే జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీచేస్తున్న బిజెపి జనసేనాని పవన్ కల్యాణ్ ను ప్రచారంలోకి దింపుతోంది. ఇందుకోసం ఇప్పటికే పవన్ కల్యాణ్ ను ఆహ్వానించినట్లు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు.
BJP JANASENA
శనివారం రాత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బిజెపి ఎంపీ డా.లక్ష్మణ్ తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. తెలంగాణలో ఇప్పటికే బిజెపి-జనసేన పొత్తు ఖరారయిన నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభపై బిజెపి, జనసేన నాయకులు చర్చించుకున్నారు.
BJP JANASENA
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 32 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోందని తెలిపారు. దీనిపై బిజెపితో చర్చలు జరిపామని... చర్చలు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. కేవలం రెండు స్థానాల విషయం ఇంకా తేలాల్సి వుందని... దీనిపై మరోసారి బిజెపితో చర్చిస్తామని తెలిపారు. ఈ అంశాన్ని నాదెండ్ల మనోహర్ సమన్వయం చేసుకుంటారని పవన్ కల్యాణ్ తెలిపారు.
BJP JANASENA
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని... హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొనాల్సిందిగా కిషన్ రెడ్డి ఆహ్వానించినట్లు పవన్ తెలిపారు. ప్రధాని పాల్గొనే ఈ బహిరంగ సభకు హాజరవుతానని పవన్ స్పష్టం చేసారు.
Modi Pawan
నరేంద్ర మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా మరింతకాలం వుండాలనే ఇటీవల జరిగిన ఎన్డీయే మీటింగ్ లో మాట్లాడుకున్నామని పవన్ తెలిపారు. ఈ దేశానికి మరోసారి మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇందుకోసం బిజెపి, జనసేన పార్టీలు కలిసి ముందుకు వెళుతున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
BJP JANASENA
ఇక పవన్ తో భేటీ అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ... జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తమకెంతో సహకరించిందని... అదే సహకారం అసెంబ్లీ ఎన్నికల్లోనూ లభిస్తోందని అన్నారు. జిహెచ్ఎంసిలో పరోక్షంగా సహకరించినా ఇప్పుడు ప్రత్యక్షంగానే బిజెపితో కలిసి ముందుకు వెళ్లేందుకు జనసేన సిద్దమయ్యిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, జనసేన కలిసి బరిలోకి దిగుతున్నాయని... సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే క్లారిటీ వచ్చిందన్నారు. కేవలం రెండు సీట్ల విషయంలో చర్చించాల్సి వుందన్నారు.
BJP JANASENA
అక్టోబర్ 7న ప్రధాని నరేంద్ర మోదీతో ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సభలో పాల్గొనాల్సిందిగా పవన్ ను ఆహ్వానించామని... అందుకు ఆయన ఒప్పుకున్నారని తెలిపారు. తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని, జనసేనాని పాల్గొంటారని... బిజెపి శ్రేణులు, ప్రజలు భారీగా తరలిరావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.