పడిపోతున్న ఉష్ణోగ్రతలు:ఏపీ,తెలంగాణల్లో పెరిగిన చలి
రెండు తెలుగు రాష్ట్రల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది.రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.దీంతో చలి పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.మంగళవారంనాడు మినుములూరులో 13,పాడేరులో14, అరకులో 16డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టుగా వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో గత నెల చివరివారం నుండే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదౌతున్న పరిస్థితి కన్పించింది.దీంతో చలి ప్రభావం పెరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.రాత్రి పూట ఉష్ణాగ్రతలు 15 డిగ్రీల సెంటీగ్రేడ్ కు పడిపోయాయని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
గత నెల 22వ తేదీన హైద్రాబాద్ మల్కాజిరిగిలో 17.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.రాజేంద్రనగర్,ఎల్ బీ నగర్ ,సరూర్ నగర్ లలో 18 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది.వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఉదయం పూట పొగమంచు కురుస్తున్నపరిస్థితి నెలకొంది.
హిమాలయాల్లో అల్పపీడన ప్రభావం కారణంగా కొన్నిరోజులు చల్లగా,మరికొన్ని రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.ఈ నెల 10వ తేదీ నుండి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.ఈ నెల 10వతేదీ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం నమోదౌతున్న ఉష్ణోగ్రతలు ఇంకా రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశంఉందని వాతావరణ నిపుణులుఅభిప్రాయపడుతున్నారు.
వాతావరణంలో మార్పుల కారణంగా రానున్న రోజుల్లో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.వాతావరణ మార్పుల కారణంగా అసాధారణ పరిస్థితులు చోటు చేసుకొనే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణశాఖాధికారులు గుర్తు చేస్తున్నారు.హైద్రాబాద్ లో నవంబర్ లో చలి కాలం ప్రభావం కన్పిస్తుంది.వాతావరణ మార్పు కారణంగా అక్టోబర్ చివరి వారం నుండి చలి ప్రభావం కొంత కన్పించిన విషయాన్ని అధికారులు గుర్తిస్తున్నారు.చలి పెరుగుతున్న తరుణంలో స్వెట్టర్లు, ఉన్ని వస్తువులకు గిరాకీ పెరిగింది.చలికాలంలో వృద్దులు ,చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.దీంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.