సారాంశం

Hyderabad: దేశానికి వ్యవసాయంలో టార్చ్ బేరర్ లా తెలంగాణ నిలుస్తున్నదని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. విస్తీర్ణంలో తెలంగాణ కన్నా పెద్దగా ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ ప్రగతికోసం పెడుతున్న ఖర్చులో 25 శాతం కూడా పెట్టడం లేదన్నారు. కోట్లాది మందికి ఉపాధి కల్పించే రంగం వ్యవసాయ రంగం అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సాగుకు ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నార‌ని తెలిపారు. 

Agriculture Minister Singireddy Niranjan Reddy: నాడు ఆకలిబాధలతో ఉన్న తెలంగాణ నేడు విజయగాధలతో ముందుకు సాగుతున్న‌ద‌నీ, రాష్ట్ర వ్య‌వ‌సాయ ప‌థ‌కాలు  దేశానికి రోల్ మోడల్ నిలుస్తున్నాయ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. ప్ర‌ముఖ వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌, భార‌త హ‌రిత విప్ల‌వ పితామ‌హుడు డాక్టర్ స్వామినాథన్ కన్న కలలవైపు తెలంగాణ పయనిస్తున్నదని చెప్పారు. సస్యవిప్లవ పితామహుడు స్వామినాథన్ ప్రతి సంధర్బంలో వ్యవసాయ ప్రాధాన్యతను వివరించార‌నీ, ప్రజల ఆకలిబాధలు చూసి డాక్టర్ వృత్తిని వదిలి వ్యవసాయ విద్య వైపు వచ్చారన్నారు. వ్యవసాయ రంగం ఆధునికతను సంతరించుకోవాలి, యాంత్రీకరణ పెరగాలి, వ్యవసాయం పరిశ్రమగా ఎదగాలి ఆయన ఆకాంక్షించార‌న్నారు.

ఎదుగుతున్న చదువుకున్న యువత వ్యవసాయరంగం వైపు రాకుంటే భారతదేశానికి భవిష్యత్ లేదు అని , తుపాకులు కొనగలరేమో కానీ, ఆహార ధాన్యాలను కొనలేరు అని అనేక సార్లు చెప్పార‌ని మంత్రి గుర్తు  చేశారు. అలాగే, తెలంగాణ ఉద్యమ ప్రాధాన్యమే వ్యవసాయ రంగమ‌నీ, తెలంగాణలోని 58 శాతం జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నార‌ని చెప్పారు. సాగునీళ్లు, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లు, ఉచిత కరంటు తో వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా త‌మ  ప్ర‌భుత్వం నిలిచింద‌ని అన్నారు. "కురచ మనసు ఉన్న వారు వీటిని అంగీకరించకపోవచ్చు కానీ, 
అంతర్జాతీయ వ్యవసాయ వేదికలలో తెలంగాణ పథకాలు, ప్రగతి ఒక చర్చగా నిలుస్తున్నది .. తెలంగాణ ప్రస్తావన లేకుండా ఏ చర్చా జరగడం లేదు.. ఇది తెలంగాణ విజయం, తెలంగాణ రైతాంగ విజయం" అని మంత్రి పేర్కొన్నారు.

ఐక్యరాజ్యసమితి సంస్థ ఎఫ్ఎఓ గుర్తించిన ప్రపంచ 20 ఉత్తమ పథకాలలో రైతుబంధు, రైతుభీమా నిలవడం తెలంగాణకు గర్వకారణమ‌ని అన్నారు. యూఎస్ఎలో జరిగే అంతర్జాతీయ వేదికలో తెలంగాణ వ్యవసాయ విజయాల గురించి చెప్పమని ఆహ్వానించడమూ గర్వకారణమేన‌ని పేర్కొన్నారు. పత్తిని ప్రోత్సహించడం మూలంగా రాష్ట్రంలో జిన్నింగ్ మిల్లులు 400కు పెరిగాయ‌నీ, వరి ఉత్పత్తి పెరగడంతో వేల సంఖ్యలో రైస్ మిల్లులు ఏర్పడ్డాయ‌ని మంత్రి వివ‌రించారు. దీంతో పెద్దఎత్తున ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయ‌ని తెలిపారు. పంటల మార్పిడిలో తెలంగాణ రైతాంగం ముందున్నదని చెప్పారు. గతంలో 40 వేల ఎకరాలు ఉన్న ఆయిల్ పామ్ అతి తక్కువ కాలంలో లక్ష 94 వేల ఎకరాలకు చేరిందన్నారు. 

దేశానికి వ్యవసాయంలో టార్చ్ బేరర్ లా తెలంగాణ నిలుస్తున్నదని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. విస్తీర్ణంలో తెలంగాణ కన్నా పెద్దగా ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ ప్రగతికోసం పెడుతున్న ఖర్చులో 25 శాతం కూడా పెట్టడం లేదన్నారు. కోట్లాది మందికి ఉపాధి కల్పించే రంగం వ్యవసాయ రంగం అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సాగుకు ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నార‌ని తెలిపారు. తెలంగాణ గ్రామ సీమల్లో కనిపిస్తున్న పంటచేలు, పల్లెలకు చేరిన ప్రజలే దీనికి నిదర్శనమ‌ని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ త‌న‌కు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యవసాయ ప్రగతికి నిరంతరం పనిచేశాన‌ని చెప్పారు. సహకారరంగంలో రూ.6 వేల కోట్లున్న టర్నోవర్ నేడు తెలంగాణ రాష్ట్రంలో రూ.20 వేల కోట్లకు పెరిగింద‌న్నారు.

గతంలో వ్యవసాయం చేసుకుంటే ఆకలిచావులు, ఆత్మహత్యలు, పంట నష్టం అన్నీ ఆకలిబాధలు .. నేడు ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో ప్రతి రోజు విజయగాథలేన‌ని అన్నారు. వ్యవసాయరంగంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను భవిష్యత్ లో అధిగమిస్తామ‌ని చెప్పారు. కాగా, హైదరాబాద్ తాజ్ డెక్కన్ కోహినూర్ హాల్ నిర్వ‌హించిన ‘పదేండ్ల తెలంగాణ వ్యవసాయ ప్రగతి’ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు కొండూరు రవీందర్ రావు, రజనీ సాయిచంద్, రామకృష్ణారెడ్డి, విజయసింహారెడ్డి, మార గంగారెడ్డి, కొండబాల కోటేశ్వర్ రావు, రాజవరప్రసాద్ రావు వనరస, ఉద్యానశాఖ డైరెక్టర్ హన్మంతరావు, వీసీ నీరజా ప్రభాకర్ , మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ప్రభుత్వ ఉద్యాన సలహాదారు డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.