Telangana 10th Results: తెలంగాణ ఫలితాల విడుదలలో కీలక మార్పులు చేశారు. గతంలో గ్రేడ్‌ల విధానంలో ఫలితాలు విడుదల కావడంతో ఎవరికి అధికంగా మార్కులు వచ్చాయో తెలిసేది కాదు.. ఈ నేపథ్యంలో ఈ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. గ్రేడ్‌లతోపాటు మార్కులను విడుదల చేయనున్నారు. దీంతోపాటు ఫలితాల విడుదల తేదీలను ప్రకటించారు. 

తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల అధికారులు సిద్దం అయ్యారు. గతంలో ఏప్రిల్‌ నెలాఖరు నాటికి ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించిన అధికారులు తాజాగా రిజల్ట్స్‌ ఏ తేదీని విడుదల చేసేది దాదాపు స్పష్టం చేశారు. దీంతోపాటు ఈ సారి ఫలితాల్లో కొన్ని మార్పులు చేశారు. అవేంటో చూద్దాం. 


తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ అధికారులు పది ఫలితాలను ఈ నెల 30న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అయిదు లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న పరిస్థితి. అయితే.. గతంలో ఫలితాలలో గ్రేడ్‌లు ఇచ్చేవారు. దీనిలో ఈ ఏడాది కొన్ని మార్పులు చేశారు. 

పదో తరగతి పరీక్ష జవాబు పత్రాల వేల్యూయేషన్‌ వారం కిందటే అధికారులు పూర్తి చేశారు. ఆన్‌లైన్‌లో మార్కులను నమోదు చేశారు. వీటిని రెండు రోజుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేయనున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇటీవల సీఎం రేవంత్‌ విదేశీ పర్యటనలో ఉండటం వల్ల ఆయన ఆమోదం కోసం ఇప్పటి వరకు ఎదురుచూశారు. సీఎం ప్రస్తుతం రావడంతో ఫలితాల విడుదల తేదీని ఫిక్స్‌ చేశారు. 


అయితే.. గతంలో పదో తరగతి ఫలితాల్లో గ్రేడింగ్ విధానంలో విద్యార్థులకు జాతీయ, రాష్ట్ర స్థాయి మార్కులు మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈ సారి, ప్రతీ సబ్జెక్టులో గ్రేడింగ్‌తోపాటుగా విద్యార్థి మార్కులు మెమోలో పొందుపరచనున్నారు. ఇంటర్నల్‌, ఎక్స్ టర్నల్‌ మార్కులు జీపీఏ మెమోలో ఇవ్వనున్నారు. 


ఇప్పటి వరకు విద్యార్థులు సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్ లు ఇచ్చారు. దీని వల్ల ఎవరికి మార్కులు ఎక్కువగా వచ్చాయో తెలిసేది కాదు. ఫస్ట్‌ ఎవరు వచ్చారనే విషయం స్పష్టత ఉండేది కాదు. ఈ నేపథ్యంలో గ్రేడ్‌తోపాటు మార్కులను అధికారులు ఇవ్వనున్నారు. ఈ ఏడాది 80 మార్కుల పరీక్ష, 20 మార్కుల ఇంటర్నల్‌ పరీక్షకు కేటాయించారు. ఇక వచ్చే ఏడాది నుంచి ఈ ఇంటర్నల్‌ మార్కులను తొలగించే అవకాశం ఉంది. మొత్తం 100 మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 

ఫలితాలు ఇలా చెక్‌చేసుకోవచ్చు.. 
విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్ రోల్‌ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ లు bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లో మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే SMS ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీని కోసం TS10 ROLL NUMBER అని టైప్ చేసి 56263కు మెసేజ్ పంపిస్తే వెంటనే ఫలితాలు SMS ద్వారా క్షణాల్లో రానున్నాయి.