చింతమడక: తెలంగాణ సీఎం కేసీఆర్ తన సొంతగ్రామమైన చింతమడకకు వరాల జల్లు కురిపించారు. రాబోయే రోజుల్లో చింతమడక బంగారు తునక కావాలని ఆకాంక్షించారు. సోమవారం చింతమడకలో పర్యటించిన కేసీఆర్ గ్రామ ప్రజలతో ఆత్మీయ అనురాగ సభావేదికపై కీలక అంశాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు లబ్ధి పొందే పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు కేసీఆర్ హామీ ఇఛ్చారు. చింతమడకకు 2 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్తీక మాసంలో చింతమడకలో గృహప్రవేశాలు జరగాలని ఆదేశించారు.

చింతమడక గ్రామం తనను కనిపెంచిందని చెప్పుకొచ్చారు. చింతమడక కోసం తాను ఎంత చేసినా తక్కువే అని అన్నారు. చింతమడక కోసం అదనంగా రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అదనపు నిధులు ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్‌ పొందవచ్చు అని సూచించారు. 

ప్రతి ఇంటిపై సోలార్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చింతమడకలో అద్భుతమైన ఫంక్షన్‌ హాల్‌ నిర్మించాలని అలాగే ప్రతీ వీధిలోనూ సీసీరోడ్లు వేయించుకోవాలని స్పష్టం చేశారు. 

అతి త్వరలోనే తాగు, సాగు నీరు కూడా రాబోతుందని తెలిపారు. చింతమడక గ్రామాన్ని చూపి పక్క ఊర్లు నేర్చుకోవాలని అలాంటప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుందని తెలిపారు. చింతమడకలోని రెండు వేల కుటుంబాలు బాగుపడాలన్నదే తన లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. 

తన పాలనలో రైతుబంధు, రైతుబీమా సౌకర్యం కల్పించానని ఆనాడు ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఎంతో సంతోషించానని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్రం ఆలోచించడం లేదన్నారు. 

 రైతు బంధు, రైతు భీమా సౌకర్యం వంటి పథకాలు పేద కుటుంబాలకు ఎంతో అండగా నిలిచాయని చెప్పుకొచ్చారు. చింతమడక చాలా మంచి ఊరు అని వాస్తు కూడా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. ఊరికి నాలుగు మూలల్లో నాలుగు అద్భుతమైన తటాకాలు ఉన్నాయన్నారు. 

మళ్లీ గ్రామంలో నీటి ఊటలు, బావుల్లో జలాలు చూడబోతున్నట్లు తెలిపారు. మీ ఊరి బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చనుబాలు ఇచ్చి పెంచిన నా ఊరు చింతమడక. మరో మూడు గ్రామాలు నాకు విద్యాబుద్ధులు ప్రసాదించాయి వాటిని కూడా అభివృద్ధిబాట పట్టిస్తానని కేసీఆర్ తెలిపారు. 

తొలి ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించామని విద్యుత్‌, తాగునీటి సమస్యలు లేకుండా చేశామని చెప్పుకొచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత  స్వగ్రామ అభివృద్ధికి సంకల్పించామన్నారు. 

ఊరు బాగుపడాలంటే ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని సూచించారు. తాను ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని బాగు చేశానని చెప్పుకొచ్చారు. రెండు మూడు నెలల్లో గ్రామ రూపు రేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత నియోజకవర్గం రూపు రేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. 

తమ ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయాలని సంకల్పించిందని ఆ బృహత్తర కార్యక్రమాన్ని చింతమడక నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆరోగ్య సూచికి నాంది చింతమడక కావాలని ఆకాంక్షించారు. 

చింతమడక ఊరంతా ఆరోగ్య పరీక్షలు చేసేందుకు శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. చింతమడకలో వెంటనే ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయాలని హరీష్‌ రావును కోరుతున్నట్లు తెలిపారు. నెల రోజుల్లో చింతమడకలో సమస్యలు లేకుండా చేయాలని కలెక్టర్‌, ఎమ్మెల్యేకు ఆదేశించారు. చింతమడక ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేయాలని సూచించారు. 

వలస వెళ్లిన వారికి కూడా ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు లబ్ధి చేకూరుస్తామన్నారు. ప్రభుత్వం అందించే లబ్ధి ద్వారా యువత ఉపాధి పొందాలన్నారు. ఎవరు ఏ ఉపాధి మార్గం ఎంచుకున్నా అభ్యంతరం ఉండదని తెలిపారు. 

ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో వరి నాటేసే మిషన్లు వంటి భారీ యంత్రాలు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ఇంకా డబ్బులు మిగిలితే ఆవులో, బర్రెలో కొనుగోలు చేసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అంతకు ముందు చింతమడకకు చేరుకున్న సీఎం కేసీఆర్ కు గ్రామ  ప్రజలు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ సైతం వారిని ఆప్యాయంగా పలకరించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నాలుగు మూలలా నాలుగు చెరువులు...చింతమడక వాస్తు అద్భుతం: కేసీఆర్

చింతమడక చేరుకున్న కేసీఆర్, ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు