రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రారంభించిన రోజు తన జీవితంలో ఎంతో సంతోషించానన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. మంగళవారం ఆయన తన స్వగ్రామం చింతమడకలో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చింతమడక వూరు వాస్తు అద్బుతంగా ఉంటుందన్నారు. దక్షిణాన దమ్మ చెరువుంటే.. ఉత్తరాన పెద్ద చెరువు ఉంటుందన్నారు. అలాగే పడమట కోమటి చెరువుంటే.. తూర్పున సింగ చెరువుంటుందన్నారు.

నాలుగు మూలల పెద్ద తటకాలను తవ్వించిన పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. చిన్నప్పుడు చెరువు పొంగితే ఇంటి ముందు కాగతం పడవలతో ఆడుకునే వాడినని కేసీఆర్ గుర్తు చేశారు.

మొదటి ప్రభుత్వంలోనే తాను చేసివుంటే వూరికే అంతా చేస్తున్నాడనే విమర్శలు వచ్చేవన్నారు. తన చిన్నతనంలో చింతమడకలో పాఠశాల, బస్సు సౌకర్యం రాలేదని.. అందుకే తాను సిరిసిల్లలో చదువుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

గజ్వేల్ ఎమ్మెల్యేగా ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నానన్నారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని.. ఎవరికి ఎలాంటి జబ్బులు ఉన్నా ఉచితంగా చికిత్స అందిస్తామని కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ మొత్తానికి సంబంధించి ఆరోగ్య సూచిక తయారు చేయించేందుకు కసరత్తు చేస్తున్నానన్నారు. చింతమడక, ఉప్పలవాని కుంట్ల, దమ్మ చెరువు, అంకంపేట, సీతారాంపల్లి, మాతపురం గ్రామాలకు సైతం సమాన ప్రాధాన్యత ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు.