Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ వీరుల పార్టీ... వీపు చూపించే పార్టీ కాదు: కేసీఆర్ కామెంట్స్

నల్గొండ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. బుధవారం హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు

telagnana cm kcr special announcements on nalgonda district ksp
Author
Nalgonda, First Published Feb 10, 2021, 5:40 PM IST

నల్గొండ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. బుధవారం హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

నల్గొండ జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నారు. అలాగే ప్రతి మండల కేంద్రం అభివృద్ధికి రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. జిల్లా కేంద్రం నల్గొండ కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

మిర్యాలగూడకు రూ. 5 కోట్లు, మిగిలిన మున్సిపాలిటీలకు కూడా ఒక్కొక్క దానికి కోటి చొప్పున ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేస్తామని చెప్పారు.

నెల్లికల్లు చుట్టుపక్కల గ్రామాల్లో భూవివాదాలు వెంటనే పరిష్కరిస్తామని... అక్కడి ప్రజలకు మూడు రోజుల్లో పట్టాలిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అలాగే త్వరలో అర్హులందరికీ, కొత్తగా పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తామని.. నల్గొండ జిల్లాను గతంలో ఏ నాయకుడు పట్టించుకోలేదని సీఎం విమర్శించారు.

రూ.2,500 కోట్లతో ఎత్తిపోతల పథకాలకు ఈ రోజు శంకుస్థాపన చేశామని కేసీఆర్ వివరించారు. ఏడాదిన్నరలో వీటన్నింటిని పూర్తి చేస్తామని.. టీఆర్ఎస్ పార్టీ, అటే వీరుల పార్టీ అని వీపు చూపించే పార్టీ కాదని గులాబీ బాస్ అన్నారు.

లిఫ్టులన్నీ పూర్తి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని కేసీఆర్ తేల్చి చెప్పారు. నేతలు ఈ ఛాలెంజ్‌ను తీసుకోవాలని... మాట ఇచ్చామంటే వెనక్కి తగ్గబోమన్నారు. కృష్ణా- గోదావరి అనుసంధానం చేసి నల్గొండ జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామని ఆయన హామీ ఇచ్చారు. పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరిస్తామన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios