హైదరాబాద్: జల్సాలకు డబ్బులు ఇవ్వడం లేదని కన్న తల్లినే అతి కిరాతకంగా నరికి చంపాడు ఓ కసాయి కొడుకు. ఈ దుర్ఘటన హైదరాబాద్ లోని బల్కంపేటలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... కర్నాటక రాష్ట్రానికి చెందిన వీరప్ప-సంగీత దంపతులకు ఐదుగురు సంతానం. అతడు కుటుంబంతో కలిసి కొన్నేళ్ల కిందట జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చాడు. అయితే ఏడాది క్రితం వీరప్ప అనారోగ్యంతో మరణించాడు. దీంతో సంగీత ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. 

పెద్ద కొడుకు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లికాగా ఇంకా ఓ కూతురు, కొడుకు తల్లి వద్ద వుంటున్నారు. ఈ క్రమంలోనే చిన్న కొడుకు సంతోష్ పనీ పాట లేకుండా జల్సాలకు అలవాడు పడ్డాడు. జల్సాలకు డబ్బుల కోసం తల్లిని నిత్యం వేధించేవాడు. 

ఇలా శనివారం మధ్యాహ్నం ఇంటిపనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లితో డబ్బుల కోసం సంతోష్ గొడవ పడ్డాడు. తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు విచక్షణను కోల్పోయాడు. వంటింట్లోకి వెళ్ళి కూరగాయలు తరిగే కత్తిని తీసుకువచ్చి దాడికి పాల్పడ్డాడు. పొట్టను చీల్చి పేగులను బయటకు లాగాడు. ఇలా కొడుకు కిరాతకంగా నరకడంతో సంగీత అక్కడికక్కడే మరణించింది.  

ఈ దారుణాన్ని దగ్గరుండి చూసిన చిన్న కూతురు భయంతో వణుకుతూ ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. అయితే కొడుకు దాడి చేసే సమయంలో సంగీత గట్టిగా అరవగా అది విన్న స్థానికులు తలుపులు తెరిచి చూడగా సంగీత రక్తపు మడుగులో పడిఉంది. పారిపోయేందుకు సంతోష్‌ ప్రయత్నించగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.  ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.