ఉద్యోగం పోయిందన్న మనస్థాపంతో ఓ సాప్ట్ వేర్ సూసైడ్ చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణంగా అంతర్జాతీయ స్థాయి కార్పోరేట్ కంపనీలు సైతం కాస్ట్ కటింగ్ పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఐటీ కంపనీలు భారీగా ఉద్యోగుల తొలగింపు చేపట్టాయి.దీంతో ఉన్న ఉద్యోగం కోల్పోయి కొత్తగా రిక్రూట్ మెంట్స్ ఏవీ లేకపోవడంతో సాప్ట్ వేర్ ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. ఇలా ఉద్యోగం పోయిందన్న మనస్థాపంతో ఓ టెకీ సూసైడ్ చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన ఇవుటూరి హరీష్(30) హైదరాబాద్ లోని ఓ సాప్ట్ వేర్ కంపనీలో పనిచేసేవాడు. నగర శివారులోని అమీన్ పూర్ లో ఓ అపార్ట్ మెంట్ భార్య నందిని, కొడుకుతో కలిసి హరీష్ నివాసముండేవాడు. అయితే ఇటీవల హరీష్ పనిచేసే కంపనీ నుండి తొలగించారు. ఉద్యోగం కోల్పోయిన అతడు మరో జాబ్ వెతుక్కోకుండా తీవ్ర మనోవేదనతో ఇంట్లోనే వుంటున్నాడు.

Read More భార్య మీద కోపం.. కూతుళ్లకు కూల్ డ్రింక్ లో విషం కలిపిచ్చిన తండ్రి.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం..

ఖాళీగా వుండటంతో ఇంటి అద్దె, కుటుంబపోషణ భారంగా మారడంతో హరీష్ మరింత ఒత్తిడికి గురయ్యాడు. దీంతో ఇలాంటి బ్రతుకు బ్రతకడం దండగని భావించాడో ఏమో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బయటకు వెళ్ళిన భార్య ఇంటికి వచ్చేసరికి హరీష్ ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు. చుట్టుపక్కల ప్లాట్స్ వారి సాయంతో భర్తను కిందకుదించి హాస్పిటల్ కు తరలించగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో భర్త మృతదేహాన్ని పట్టుకుని నందిని కన్నీరుమున్నీరుగా విలపించింది. హరీష్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.