హైదరాబాద్: హైద్రాబాద్ హస్తినాపురంలో టెక్కీ ప్రదీప్ రాగి జావలో పురుగుల మందు కలిపి తిన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత భార్యా పిల్లలు తిన్న తర్వాత టెక్కీ ప్రదీప్ కూడ ఇదే తిని మృతి చెందినట్టుగా భావిస్తున్నారు. భార్యా ఇద్దరు పిల్లలు మరణించిన ఆరేడు గంటల తర్వాత ప్రదీప్ మరణించినట్టుగా గుర్తించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నేరేడుగొమ్మకు చెందిన టెక్కీ ప్రదీప్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన శంకర్, పుష్పలతల కూతురు స్వాతిని 2012లో పెళ్లి చేసుకొన్నాడు. ప్రదీప్ బెంగుళూరు టీసీఎస్ లో కొంత కాలం పనిచేశాడు. ఆ తర్వాత హైద్రాబాద్ గచ్చిబౌలిలోని ఐబీఎం లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు.

నాలుగేళ్ల క్రితం హైద్రాబాద్ హస్తినాపురంలో స్వంత ఇంటిని నిర్మించుకొన్నాడు ప్రదీప్.ఈ ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు నుండి లోన్ తీసుకొన్నాడు. ఆ తర్వాత ఎల్ఐసీ నుండి రుణం తీసుకొన్నాడు.  ఈ డబ్బులతో ప్రదీప్ రియల్ ఎస్టేట్ తో వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాడు.

అయితే ఈ వ్యాపారం ఆయనకు కలిసిరాలేదు. నష్టాలు వచ్చాయి. ఈ నష్టాల నుండి బయటపడాలంటే ఆయనకు మార్గం దొరకలేదు. భార్యకు తెలియకుండానే ప్రదీప్ అప్పులు చేసినట్టుగా సూసైడ్ నోట్ లో రాశాడు. తండ్రికి భారం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ప్రదీప్ భార్యా పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తేలింది.

శనివారం సాయంత్రం స్వాతి, ప్రదీప్‌కుమార్‌ ఫ్యామిలీ వాట్సాప్‌ గ్రూప్‌ల నుంచి ఎగ్జిట్‌ అయ్యారు. వారి సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ అయ్యాయి. దీంతో నగరంలోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న స్వాతి అన్న గుగ్గిల్ల సతీష్‌కుమార్‌కు అనుమానం వచ్చింది. 

వెంటనే  సతీష్‌కుమార్‌ తన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి నగరానికి వచ్చాడు. ప్రదీప్‌ ఇంటికి వెళ్లగా ఇంటి డోర్‌ సెంట్రల్‌ లాక్‌ సిస్టం కావడంతో ఏమీ కనిపించలేదు. దీంతో అదే రాత్రి మూడు గంటలకు ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ అశోక్‌రెడ్డి తన సిబ్బందితో వెళ్లి కిటికీ అద్దాలు పగులగొట్టారు. ప్రదీప్‌కుమార్‌ ఇంటి హాలులో విగతజీవిగా పడి ఉండడాన్ని చూశారు.

వెంటనే ఇంటి తలుపులు పగులగొట్టి చూశారు. ఇంట్లో నాలుగు మృతదేహాలు కన్పించాయి.స్వాతి, కళ్యాణ్ కృష్ణ, జయకృష్ణ మృతదేహలు దుర్వాసన వస్తున్నాయి. ప్రదీప్ మృతదేహం ఇంకా ఆ స్థితికి చేరుకోలేదు. ప్రదీప్ తన డైరీలో సూసైడ్ లెటర్ రాశాడు. ప్రదీప్ ఉపయోగించే ల్యాప్ టాప్, ఫోన్లలో మరిన్ని వివరాలు లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.