కడప: కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో అత్యధిక వార్డులను టీడీపీ కైవసం చేసుకొంది. ఈ మున్సిపాలిటీలో 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు.  వైసీపీకి చెందిన అభ్యర్దులు 11 స్థానాల్లో గెలుపొందారు. ఒక్క చోట జనసేన అభ్యర్ధి నెగ్గారు.

సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోని మైదుకూరు మున్సిపాలిటీలో టీడీపీ ఎక్కువ స్థానాలను గెలుచుకొంది. మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా కన్పించాయి. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కడప జిల్లాలోని మైదుకూరు మున్సిపాలిటీల్లో  టీడీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి.

రాష్ట్రంలోని మిగిలిన మున్సిపాలిటీల్లో  టీడీపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. చాలా మున్సిపాలిటీల్లో టీడీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. కొన్ని చోట్ల టీడీపీకి అసలు ఒక్క వార్డు కూడా దక్కలేదు.

ఈ రెండు మున్సిపాలిటీల ఫలితాలు టీడీపీ రాష్ట్ర నాయకత్వంలో చర్చ చేస్తోంది. ఇతర మున్సిపాలిటీలో ఏకపక్షంగా ఎన్నికల ఫలితాలు వచ్చినా ఈ రెండు మున్సిపాలిటీల్లో వచ్చిన ఫలితాలు టీడీపీ నాయకత్వంలో చర్చకు కారణమయ్యాయి.

వైసీపీకి ధీటుగా నిలబడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో టీడీపీ విజయానికి కారణమయ్యాడనే అభిప్రాయాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.