ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో ఇటీవల జరిగిన మహానాడుకు తనను ఆహ్వానించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. తాను దళితుడిని  కాబట్టే.. మహానాడుకి ఆహ్వానించలేదని మండిపడ్డారు.

చంద్రబాబు కంటే తెలంగాణ సీఎం కేసీఆరే నయమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో చంద్రబాబుకు విశ్వసనీయత లేదన్నారు. ఈ మేరకు మోత్కుపల్లి శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘‘నేనేం తప్పుచేశానో చంద్రబాబు చెబితే  ముక్కునేలకు రాస్తా. పిలిచి మాట్లాడి ఉంటే అన్నీ చెప్పేవాడిని. మహానాడుకు నన్ను ఎందుకు పిలవరు? దళితుణ్ని కాబట్టే ఎంత సీనియర్‌ను అయినా నన్ను పిలవలేదా?’’ అని ప్రశ్నించారు. రేవంత్‌ వంటివారి వల్ల తెలంగాణలో టీడీపీ బలైపోయిందని, చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారని అన్నారు. తాను ఇప్పటికీ చంద్రబాబు పక్షమేనని, పార్టీకి జరుగుతున్న నష్టంపై మాట్లాడుదామనుకుంటే అవకాశం ఇవ్వడంలేదని తెలిపారు.

‘‘ఎన్టీఆర్‌ నా పెళ్లికి ముహూర్తం పెట్టిండు. నా పెళ్లి సందర్భంగా ఆయన విందు ఇచ్చిండు. కానీ, నా బిడ్డ పెళ్లిని తాను దగ్గరుండి చేస్తానన్న చంద్రబాబు.. రావడమే కష్టమైంది. అదే కేసీఆర్‌తో తాను 15 ఏళ్ల నుంచి మాట్లాడకపోయినా.. టెమ్‌కు వచ్చిండు. కేసీఆర్‌ను చూస్తే ఎన్టీఆర్‌ గుర్తుకువస్తరు. పేదోడికి, తిండికి లేనోడికి కేసీఆర్‌ రాజ్యసభ అవకాశం ఇచ్చిండు. మీరు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. బడుగు, బలహీనవర్గాలకు చేసిన న్యాయం ఇదేనా? ఎస్సీ వర్గీకరణపై ఇక్కడి సీఎం అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపిండు. మీరెందుకు చేయలేదు?’’ అని మోత్కుపల్లి మండిపడ్డారు.

 రేవంత్‌పై చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. ‘‘మీరు చెబితేనే కాంగ్రెస్ లో చేరానంటూ రేవంత్‌ ప్రచారం చేసుకుంటున్నడు. ఆయన రాహుల్‌ను కలిసినా పట్టించుకోలేదు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా సస్పెండ్‌ చేయలేదు’’ అని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ మన మిత్రుడేనని, అవసరమైతే జతకడదామని తాను అంటే.. టీఆర్‌ఎస్ తో జతకట్టవద్దని, కాంగ్రెస్‌తో పొతుపెట్టుకుందామని రేవంత్‌ అన్నాడని గుర్తు చేశారు. అలాంటి రేవంత్‌ ఇప్పుడెక్కడున్నాడని
 ప్రశ్నించారు. ‘‘నాకు గవర్నర్‌ పదవి ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వస్తే.. హోదా ఉద్యమం నడుస్తోందంటూ ఆపింది మీరు కాదా?’’ అని నిలదీశారు.