కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి టిడిపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్.రమణకు మధ్య వైరం ఇంకా రగులుతూనే ఉన్నది. టిడిపికి గుడ్ బై చెప్పిన నాటినుంచి నేటి వరకు రమణకు రేవంత్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏదోరూపంలో వీరిద్దరూ ఘాటైన విమర్శలు చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న కేసిఆర్ దగ్గర ఉపాధి కూలీ గా రమణ ఉన్నాడంటూ రేవంత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనికి రమణ కూడా అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా ఒక గట్టి సవాల్ ను రేవంత్ కు విసిరారు. రమణ. ఆ సవాల్ ఏంటో చదువుదాం.

మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టిడిపి అధ్యక్షులు రమణ మీడియాతో ముచ్చటించారు. తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత సంపాదించిన ప్రతి పైసా పేదల కోసం ఖర్చు చేస్తున్నానని చెప్పారు. 1994లో తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత తాను ఎలాంటి ఆస్తులను కొత్తగా కొనలేదని స్పష్టం చేశారు. దీనిమీద ఎవరు ఎలాంటి విచారణ చేసినా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తన ఆస్తులపైనా, అలాగే రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఆస్తులపైనా విచారణకు నేను సిద్ధం.. రేవంత్ సిద్ధమేనా అని ప్రశ్నించారు.

సంపాదన కోసమే తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు రమణ. డబ్బుల కోసం, పదవుల కోసం ఏనాడూ ఎవరితోనూ లాలూచీ పడలేదన్నారు. కేసిఆర్ దగ్గర కూలీ తెచ్చుకుని పనిచేస్తున్నట్లు రేవంత్ చేసిన ఆరోపనలు పూర్తిగా తప్పు అని చెప్పారు. పదవుల కోసమే అయితే తాను టిఆర్ఎస్ కు వెళ్లాల్సిన అవసరమే లేదన్నారు.

తన తండ్రి పేరుతో ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా పేద ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు. ఇప్పటి వరకు ఆ సంస్థ ద్వారా 6వేల మందికి వైద్యం చేయించినట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే తెలంగాణలో బడుగు,  బలహీన వర్గాల వారికి గౌరవం, గుర్తింపు, రాజకీయ అవకాశాలు పెరిగాయని స్పష్టం చేశారు.