న్యూఢిల్లీ: టిడిపి ఎంపీ టీజీ వెంకటేష్ టిఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేకే ఎక్కడ ఉన్నాడని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ కాళ్ళు ఒత్తడం తప్ప కేకేకు మరో పనిలేదన్నారు.రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ గా కేకే బాధ్యతలు స్వీకరిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు.

శుక్రవారం నాడు న్యూఢిల్లీలో టీజీ వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ ఎంపీ  కే. కేశవరావు గురువారం నాడు టిడిపి ఎంపీ టీజీ వెంకటేష్‌పై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. కేకేపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

తెలంగాణ ఉద్యమంలో కేకే పాత్ర ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ నడిపాడని ఆయన చెప్పారు. కెసిఆర్ కాళ్ళు వత్తుకొంటూ కేకే పబ్బం గడుపుకొన్నారని ఆయన దుయ్యబట్టారు.  తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులు, యువకులు కీలక పాత్ర పోషించారని ఆయన చెప్పారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా ఉన్న కాలంలో తనను సమైఖ్యాంధ్ర ఉద్యమం నడపాలని కేకే కోరాడని టీజీ వెంకటేష్ గుర్తు చేశారు. పిచ్చోళ్ళకు ఎవరు మాట్లాడినా పిచ్చోళ్ళుగానే కన్పిస్తారని  ఆయన  అభిప్రాయపడ్డారు.  తనలో హాట్ బ్లడ్ ఉందన్నారు. కేకే బ్లడ్ లో మొత్తం సారాయి మాత్రమే ప్రవహిస్తోందన్నారు. 

తాను సబ్జెక్ట్ మాట్లాడితే  కేకే తన మీద వ్యక్తిగత విమర్శలకు దిగారని టీజీ వెంకటేష్ మండిపడ్డారు. రాయలసీమ వెనుకబాటుకు గురైందని ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పోరాటం చేస్తున్న సమయంలో తన వాదనతో కెసిఆర్ కూడ ఏకీభవించారని ఆయన గుర్తు చేశారు. 

కడప, బయ్యారంలో స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్ర సమస్యలపై టిఆర్ఎస్ ఎంపీలు కూడ గళమెత్తాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు.  రెండు రాష్ట్రాలకు చెందిన సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేయకపోతే  రెండు రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

తాను సబ్జెక్ట్ మాట్లాడితే తనపై కేకే వ్యక్తిగత విమర్శలకు దిగాడని టీజీ మండిపడ్డారు.  రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్‌గా కేకే బాధ్యతలు స్వీకరిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన  స్పష్టం చేశారు. 

అలాంటి నేతలు డిప్యూటీ ఛైర్మెన్ గా ఉన్న సభలో తన లాంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదన్నారు టీజీ వెంకటేష్.తాను మాట్లాడింది చిల్లర మాటలైతే  కేకే ఎందుకు సీరియస్‌గా తీసుకొన్నారని ఆయన ప్రశ్నించారు. కేకేకు  మోకాల్లో మెదడు ఉందని ఆయన విమర్శించారు.