దేశవ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇక్కట్లను ఎంపి బుర్రకథ రూపంలో వినిపించారు. సామాన్యులు చేతిలో డబ్బు లేకుండా 50 రోజులు ఏ విధంగా గడుపుతారంటూ ప్రధానిని ఎంపి ప్రశ్నించారు.

నోట్ల రద్దు సమస్యలపై తెలుగుదేశం పార్టీ ఎంపి శివప్రసాద్ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసారు. పెద్ద నోట్లను ప్రధానమంత్రి రద్దు చేయటాన్ని ఎంపి తనదైన శైలిలో తీవ్రంగా నిరసించారు. మోడి చర్యతో సామాన్యుల గెండెలు బద్దలైనట్లు చెప్పారు. నల్లధన కుబేరేలేమో నోట్ల రద్దు తర్వాత కూడా ఆనందంగానే ఉండగా కష్టమంతా సామాన్యులకే వచ్చిపడిందన్నారు. కరువుకు మించిన సమస్య సామాన్యుల ఇంట్లోకి కూడా ప్రవేశించిందని వ్యగ్యంగా అన్నారు.

మోడి తీసుకున్న ఏకపక్ష నిర్ణయం సరికాదని, కాబట్టి సమస్య పరిష్కారినికి వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. నోట్ల రద్దు వల్ల ఏర్పడిన సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని తాను కూడా అనుకున్నట్లు చెప్పారు. అందుకే వారం పాటు తాను ఏమీ మాట్లాడలేదన్నారు. కానీ ఈ సమస్య పరిష్కారానికి 50 రోజులు పడుతుందని చెప్పటంతో బహిరంగంగా తాను బయటకు రాక తప్పలేదని స్పష్టం చేసారు. పెళ్లిళ్ళు ఆగిపోయి తల్లి, దండ్రులకు కడపు కోత మిగిలుతోందన్నారు. ఇప్పటికే 50 మంది చనిపోయారని ఆరోపించారు. ఇంకా ఎంత మంది చనిపోవాలని కేంద్రం చూస్తోందో అని వ్యగ్యంగా ప్రశ్నించారు. సామాన్యుల కష్టాలను గమనించని ప్రధాని ఎందుకన్నట్లుగా వ్యాఖ్యానించారు.

 సామాన్యులు చేతిలో డబ్బు లేకుండా 50 రోజులు ఏ విధంగా గడుపుతారంటూ ప్రధానిని ఎంపి ప్రశ్నించారు. ఏ బ్యాంకు వద్దా సరిపడా డబ్బులేవన్నారు. ఏటిఎంలలో డబ్బులు తీసుకుందామన్నా సాధ్యం కావటం లేదన్నారు. కొందరి కోసం కోట్లాది మంది సామాన్యులను ఇబ్బందులకు గురిచేయటం ఏమి సబబని మోడిని నిలదీసారు. హైదరాబాద్ లో తాను కూడా మిత్రుల వద్ద డబ్బులు తీసుకుని భోజనం చేయాల్సి వచ్చిందని వాపోయారు. తన వేదనను, ప్రజల బాధను ఎంపి మొత్తం బుర్రకథ రూపంలో దాదాపు 15 నిముఫాల పాటు వినిపించారు. ఆయన వినిపించిన బుర్రకథ మొత్తం మోడి చర్యకు వ్యతిరేకంగా ఉండటం గమనార్హం.

రాష్ట్ర విభజన సమయంలో శివప్రసాద్ రోజుకో రకంగా వేషాలు వేసుకుని పార్లమెంట్ ముందు ప్రజల మనోభావాలను వినిపించేంవారు. ఇపుడు కూడా మోడి చర్యకు వ్యతిరేకంగా అదే పంథాను మొదలుపెట్టారు. టిడిపి ఎంపి బాహాటంగా మోడి చర్యను వ్యతిరేకించటమంటే పెద్ద నోట్ల రద్దుపై టిడిపి అధినేత చంద్రబాబునాయడు వైఖరిలో మార్పు వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆదివారం నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై చంద్రబాబు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయటం, సోమవారం ఎంపి బుర్రకథ రూపంలో మోడి చర్యను తీవ్రంగా తప్పుపట్టటం విశేషం.