తెలంగాణ టిడిపి మహానాడుకు మోత్కుపల్లి డుమ్మా

తెలంగాణ టిడిపి మహానాడుకు మోత్కుపల్లి డుమ్మా

తెలంగాణ లో ఇప్పటికే సీనియర్ నాయకుల వలసలతో సతమతమవుతున్న తెలుగు దేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆ పార్టీ సీనియర్ నాయకులు మోత్కపల్లి నర్పింహులు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య  ఇవాళ నిర్వహిస్తున్న మహానాడుకు డుమ్మా కొట్టారు. గతకొంత కాలంగా వీరిద్దరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో వీరు మహానాడుకు రాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చతికిల పడ్డ సమయంలో కూడా మోత్కుపల్లి నర్సింలు లాంటి నాయకులు పార్టీని వీడకుండా కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఇటీవల కాలంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న కారణాలతో నర్సింలు రగిలిపోతున్నారు. దీంతో గత కొంత కాలంగా ఈయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా తెలుగుదేశం జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న మహానాడుకు కూడా రాకపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

ఇటీవల మోత్కపల్లి తెలంగాణ లో ఉనికిని కోల్పోయిన టిడిపి పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆయన ఈ ప్రకటన చేయడంతో పార్టీ మారతాడని భారీగా ప్రచారం జరిగింది. అయితే ఆయన పార్టీ మారే అవకాశం లేదని ఇవన్నీ పుకార్లే అని టిటిడిపి నాయకులు కొట్టిపారేశారు. తాజాగా  హైదరాబాద్ లో జరుగుతున్న మహానాడుకు నర్సింహులు గైర్హాజరవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. 

ఇక మరో సీనియర్ నాయకులు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కూడా ఈ మహానాడుకు హాజరయ్యారు. అయితే ఆయన ఇదివరకు బిసి ల కోసం ఓ కొత్త పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన గైర్హాజరవడం ఎవరిని ఆశ్చర్యపర్చలేదు కానీ మోత్కుపల్లి డుమ్మా కొట్టడం పైనే ప్రస్తుతం రాజకీయంగా చర్చ జరుగుతోంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page