Asianet News TeluguAsianet News Telugu

టిడిపి నేత రావుల కు విషమ పరీక్ష

  • టిడిఎల్పీ సమావేశంపై ఎడ తెగని ఉత్కంఠ
  • రావుల పోతడా ? పోడా?
  • పార్టీ నేతల్లో హాట్ టాపిక్
  • మిగతా లీడర్లు పోతరా ? పోరా అని చర్చలు
Tdp leader Ravula faces hamletian dilemma

ఆయన తెలుగుదేశం పార్టీలోనే అందరికంటే సౌమ్యుడు. తెలుగు రాజకీయాల్లో వివాద రహితుడైన నాయకుడు. అంతకుమించి రోజు రోజుకూ దిగజారుతున్న రాజకీయాల్లో నీతి, నిజాయితీ కోసం తపించే వ్యక్తి. ఆయనెవరో కాదు వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి. ఎన్టీఆర్ హయాంలో యువ నేతగా రాజకీయాల్లోకి వచ్చి టిడిపిలో పనిచేశారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా టిడిపిని వీడకుండా పార్టీకోసమే పనిచేసే నాయకుడు. గెలిచినా, ఓడినా పార్టీ కోసమే తపించే నేత. ఆయనకు ఏరకమైన వ్యాపారాలు లేవు. ఉన్నదల్లా రాజకీయమే. మరి అలాంటి రాజకీయ నేతకు విషమ పరీక్ష ఎదురైంది. ఒకవైపు తమ్ముడి మీటింగ్ మరోవైపు పార్టీ వైఖరి... ఈరెండింటిలో ఎటువైపు కాలు కదపాలో తెలియని ఆందోళ. ఇంతకూ వివరాలేంటి అంటారా? అయితే చదవండి.

ఈనెల 26న అసెంబ్లీలోని టిడిఎల్పీ ఆఫీసులో టిడిఎల్పీ సమావేశం ఉంది. టిడిఎల్పీ నేత రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఆర్. కృష్ణయ్య లు హాజరవుతారని రావుల మూడు రోజుల క్రితం ప్రకటించారు. అంతేకాకుండా టిడిపిలో పనిచేసిన తెలంగాణ మాజీ ఎంపిలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఈ సమావేశానికి రావాలని ఆహ్వానం పంపిర్రు. ఈ సమావేశ ఏర్పాటులో కూడా రావుల చంద్రశేఖరరెడ్డి కీలక పాత్ర పోశిస్తున్నారు.

అంతవరకు బాగానే ఉంది కానీ... ఇంతలో రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి మధ్య గంట గంటకూ వైరం పెరుగుతున్నది. మాటల తీవ్రత ఎక్కువైతున్నది. రేవంత్ మీద ఎపి నేతలు, తెలంగాణ నేతలు విమర్శల వర్షం మొదలు పెట్టారు. దీంతో అసలు టిడిఎల్పీ సమావేశం జరుగుతుందా? లేదా? అన్నది ఒక సందేహంగా మారింది. ఒకవేళ జరిగితే ఎమ్మెల్యేలు హాజరవుతారా? మాజీలు హాజరవుతారా? అన్నది కూడా అనుమానంగా మారింది. ఇక ఆ సమావేశానికి నేను పోనే పోను అని సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కుండబద్ధలు కొట్టారు. ఆ సమావేశానికి రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా వెళ్లకూడదని నేను కోరుకుంటున్నాను అని కూడా మోత్కుపల్లి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆ సమావేశంపై ఉత్కంఠ రేగుతున్నది. ఎవరెవరు వస్తారన్నది తేలాల్సి ఉందగా అసలు సమస్య రావుల చంద్రశేఖరరెడ్డికి ఎదురైంది.

ఆ సమావేశం జరుగుతుందని, దానికి అందరూ హాజరు కావాలని, రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే అది ఏర్పాటు చేసినట్లు రావుల మీడియా ముందు అధికారికంగా ప్రకటించారు. దీంతో సమావేశం వివరాలను అధికారికంగా ఎన్టీఆర్ భవన్ లో వెల్లడించినందున ఆ సమావేశానికి రావుల ఇప్పుడు పోతారా? పోరా అన్నది తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన స్థాయిలో చర్చనీయాంశమైంది. అలాగే మిగతా రాజకీయ పార్టీల్లోనూ హాట్ టాపిక్ అయింది.

అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం (చంద్రబాబు) డైరెక్షన్ మేరకే మాత్రమే రావుల నడుచుకునే అవకాశం ఉందని... పార్టీ అధిష్టానం ఆదేశాలు సమావేశానికి వెళ్లాలని ఉంటే వెళ్తారు.. వద్దని సంకేతాలు వస్తే వెళ్లకపోవచ్చు అన్నది రావుల సన్నిహితుడొకరు వెల్లడించారు. మొత్తానికి రావుల సమావేశానికి వెళ్లడం... వెళ్లకపోవడం విషయం తేలితే రేవంత్ టిడిపి బంధం విషయంలో కూడా మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రావుల ఆ సమావేశానికి పోతే... రేవంత్ టిడిపి మధ్య ఇంకా మంచి రిలేషన్ ఉన్నట్లు... రావుల సమావేశానికి దూరంగా ఉంటే.. ఇక రేవంత్ టిడిపి బంధం తెగిపోయినట్లేనని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా తెలుగు తమ్ముళ్లలో మరో ఉత్కంఠ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు.

 

కేసిఆర్ కు భారత రత్న ... ఈ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/8WE6wB

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios