Asianet News TeluguAsianet News Telugu

రైతుబంధు పథకాన్ని పొగిడిన తెలుగు తమ్ముడు

పసుపు గులాబీ వర్ణం

TDP leader praises KCR's Rythu Bandhu scheme

తెలంగాణలో తెలుగు తమ్ముళ్లకు, టిఆర్ఎస్ పార్టీకి మధ్య ఇప్పటికీ పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితే ఉంది. తెలంగాణ వచ్చిన మొదట్లో ఇరు పార్టీల మధ్య ఎంత వైరం ఉందో తాజాగా కూడా అదే వైరం నడుస్తోంది. మధ్యలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని కొందరు నాయకులు హడావిడి చేశారు. కానీ వారిలో ఎక్కువ మంది టిడిపి వీడి బయటకు వెళ్లిపోయారు.  ఆ సమయంలో మాత్రం రెండు పార్టీల మధ్య కొద్దిగా విమర్శలు, ప్రతి విమర్శలు తగ్గాయి.
కానీ ఎప్పుడైతే తెలంగాణ సిఎం కేసిఆర్ ఓటుకు నోటు కేసును కదిలించారో మళ్లీ ఇరు పార్టీల మధ్య తీవ్రమైన వైరం నడుస్తోంది. అయితే ఆ వైరాన్ని పక్కన పెట్టి ఒక తెలుగు తమ్ముడు కేసిఆర్ రైతు బంధు పథకం మీద పొగడ్తల జల్లు కురిపించారు. ఆయనెవరో కాదు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా టిడిపి అధ్యక్షులు పెద్దిరెడ్డి రాజా. ఏకంగా ఒక జిల్లా అధ్యక్షుడే టిఆర్ఎస్ సర్కారుపై పొగడ్తల వర్షం కురిపించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష పార్టీలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండి ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించాల్సిందిపోయి సర్కారుకు భజన చేయడం ఏంటని కొందరు తమ్మళ్లు లోలోన రగిలిపోతున్నారు. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలంలో ఆయన పేరిట, ఆయన సతీమణి పేరిట ఉన్న వ్యవసాయ భూమికి రైతుబంధు పథకం కింద వచ్చిన 6800 రూపాయల చెక్కులను తీసుకున్నట్లు చెప్పారు. రైతు బంధు పథకాన్ని టిడిపి స్వాగతిస్తుందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతాంగానికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని వివరించారు.
ఆపరేషన్ ఆకర్ష్ మంత్రమా ?
తెలంగాణలో వరుసపెట్టి నేతలంతా అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరిపోతున్న రోజులివి. ఈనేపథ్యంలో సూర్యాపేట టిడిపి జిల్లా అధ్యక్షులు పెద్ది రెడ్డి రాజా కూడా టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరిపోతారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న లీడర్లు వరుసపెట్టి టిఆర్ఎస్ లో చేరిపోయారు. కొందరు కాంగ్రెస్ వైపు కదిలారు. మిగిలి ఉన్న నేతలంతా టిడిపి ని వీడి కారెక్కుతారన్న ప్రచారానికి పెద్దిరెడ్డి రాజా ప్రకటన ఆజ్యంపోసినట్లైందని అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios