టీడీపీ సీనియర్ నేత ,మాజీ ఎంపీ ఒకరు త్వరలో కమలం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమ బలం పెంచుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే  అసంతృప్తి నేతలు, మాజీ నేతలకు గాలం వేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఆ పార్టీ తీర్థం పుచ్చుకోగా... తాజాగా మరికొందరు నేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

గత కొద్దిరోజులుగా టీడీపీ మాజీ ఎంపీ ఒకరు బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు రాష్ట్ర బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఆయన ఎవరు అన్నదానిపై మాత్రం క్లారిటీ రాలేదు.  

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఈనెల 18న బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ కండువా వేసుకోనున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే వూకె అబ్బయ్య కూడా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 18న బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు.