టీ కాంగ్రెస్ మహిళా నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

‘సీతక్క గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ నియోజకవర్గానికి మీరు చేస్తున్న మంచి పనులను కొనసాగించడానికి వీలుగా దేవుడు మీకు శక్తిని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అమ్మా’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

అలాగే కరోనా సంక్షభ సమయంలో అద్భుతంగా సేవలందించిన ఆమెకు నారా లోకేశ్ కంగ్రాట్స్ తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

కాగా నక్సల్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సీతక్క అనంతరం జన జీవన స్రవంతిలో కలిశారు. 2004లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

2014లో టీఆర్ఎస్ అభ్యర్ధి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయిన ఆమె.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి, రెండోసారి శాసనసభలో అడుగుపెట్టారు.

కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఆమె ఏజెన్సీ ప్రాంతాల్లో కాలినడకన తిరుగుతూ గిరిజనులకు కూరగాయలు, బియ్యం పంచిపెట్టారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి కూడా సీతక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.