హైదరాబాద్: జీహెచ్ఎంసీ  పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన శుక్రవారం నాడు కొనసాగింది. అసెంబ్లీలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన సవాల్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించిన విషయం తెలిసిందే.

హైద్రాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూపించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ పై గురువారం  నాడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.... సీఎల్పీ నేత  భట్టితో కలిసి నగరంలో పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు.

also read:జీహెచ్ఎంసీ ఎన్నికలు: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

గురువారం నాడు నగరంలో సుమారు 3428 ఇళ్లను పరిశీలించినట్టుగా సీఎల్పీ నేత భట్టి ప్రకటించారు. ఇవాళ కూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన సాగుతోంది. ఇవాళ ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భట్టి నివాసానికి చేరుకొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు బయలుదేరారు.

ఇవాళ కొల్లూరు, కుత్బుల్లాపూర్, జవహర్ నగర్, రాజేంద్రనగర్ లలో ఇళ్లను పరిశీలిస్తారు. ఇవాళ కూడ పరిశీలన పూర్తి కాకపోతే రేపటి నుండి అధికారులను ఇళ్ల పరిశీలనకు పంపుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సాంకేతిక కారణాలను  సాకుగా చూపొద్దని ఆయన కాంగ్రెస్ నేతలకు సూచించారు.

also read:లక్ష ఇళ్లు చూపించేవరకు తిరుగుతా: తలసాని, 3428 ఇళ్లే చూశామన్న భట్టి

ఇంత అద్భుతంగా ఎప్పుడూ కూడ పనులు జరగలేదన్నారు.ఇళ్లు చూసేవారికి నిజాయితీ ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవాళ ఎన్ని ఇళ్లు చూస్తారో అన్ని కాంగ్రెస్ నేతలకు చూపిస్తామని ఆయన చెప్పారు. వర్షానికి నీళ్లు రాకపోతే నిప్పులు వస్తాయా అని ఆయన ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే హైద్రాబాద్ నగరంలో లక్ష ఇళ్లు చూపే వరకు తాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వదలబోనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లక్ష ఇళ్లను హైద్రాబాద్ లోనే చూపించాలని ఆయన కోరారు.రాష్ట్రం మొత్తం లక్ష ఇళ్లు చూపిస్తామంటే కుదరదన్నారు.