తెలంగాణ తెలుగు అకాడమీ నాన్- గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (T-TANGO) సభ్యులు సంచాలకులు, తెలుగు అకాడమీ వారిని మరియు సంచాలకులు, ఏపీ తెలుగు అకాడమీ వారిని కలిసి అత్యున్నత  న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతరం ఉత్తర్వుల మేరకు ఇరు పక్షాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ఏకాభిప్రపాయంతో అకాడమీ ఉద్యోగులను ఒక నెలలోపు విభజన చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు బి.లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడి ఏడు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ అకాడమీ విభజనకాకపోవడం వలన తెలంగాణ ఉద్యోగులకు ప్రమోషన్ విషయంలో, రిక్రూట్‌మెంట్ జరగక నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.

అందువల్ల ఇకనైనా ఇరు డైరెక్టర్లు కూర్చొనీ ఏకాభిప్రాయంతో తెలంగాణ ఉద్యోగులు తెలంగాణకు, ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు ఆంధ్రాకు కేటాయించే విధంగా అకాడమీ విభజన చేయాలని కోరారు.

ప్రధాన కార్యదర్శి సామ బాబురెడ్డి మాట్లాడుతూ.... కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా అకాడమీ విభజనలో జాప్యం చేయడం తగదని పేర్కొన్నారు. ఇప్పటికీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోని పక్షంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కే. సదన్ తేజ్, జాయింట్ సెక్రటరీ ఎస్. శ్యాంసుందర్, కోశాధికారి ఎన్. శ్రీనాథ్, సభ్యులు చంద్రకుమార్, పద్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.

కాగా, తెలుగు అకాడమీ పంపకాల విషయంలో ఇరు రాష్ట్రాలు చర్చించుకుని నెలరోజుల్లో ఏకాభిప్రాయానికి రావాలని సుప్రీంకోర్టు గత వారం సూచించింది. ఒకవేళ ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే అప్పుడు తాము విచారణ చేపడతామని స్పష్టం చేసింది.