Asianet News TeluguAsianet News Telugu

టి న్యూస్ సంతోష్ విషయంలో షాకింగ్ రెస్పాన్స్

  • సంతోష్ కుమార్ కు ఖరారైన రాజ్యసభ
  • యాదవుల కోటాలో కల్వకుర్తి జైపాల్ కు 
  • మూడో సీటుపై కొనసాగుున్న కసరత్తు
t news santosh become a rajya sabha member

టిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల కసరత్తు ఇంకా కొనసాగుతోంది. ఈనెల 12వ తేదీన నామినేషన్లు దాఖలు చేయాలని పార్టీ ముహూర్తం నిర్ణయించింది. కానీ అభ్యర్థుల ఖరారు విషయంలో ఇంకా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మూడు సీట్లలో ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు రెండు సీట్లు ఖరారైనట్లు తెలుస్తోంది. మూడో సీటు అదృష్టం ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ పార్టీలో నెలకొంది. మొదటి సీటు టిన్యూస్ సంతోష్ అలియాస్ టిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సంతోష్ కుమార్ కు ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తమకు అవకాశం ఇవ్వాలంటే తమకు ఇవ్వాలంటూ పార్టీ నేతలు తమకు తోచిన రీతిలో రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పార్టీ నేతలు కాకపోయినా.. ఉద్యమంలో పాల్గొని టిఆర్ఎస్ తో టచ్ లో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు, డాక్టర్లు, లాయర్లు సైతం ప్రయత్నాల్లో ఉన్నారు. ఉన్నవే మూడు సీట్లు కావడంతో పోటీ తీవ్రంగా ఉన్నది. ఇప్పటికే కేసిఆర్ కు అత్యంత సన్నిహితుడు, అంతరంగికుడు, స్వయాన తన సడ్డకుడి కొడుకు అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఒక రాజ్యసభ సీటు ఖరారు చేశారు.

రెండో రాజ్యసభ సీటును యాదవులకు కేటాయించారు. యాదవులకు ఇస్తానన్న రాజ్యసభ సీటు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమచారం. ఒక రాజ్యసభ సీటు యాదవులకు కట్టబెడతానని పలు సందర్భాల్లో సిఎం కేసిఆర్ ప్రకటించారు. అయితే ఆ సీటు కోసం యాదవ ప్రముఖులు తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు. పార్టీలో ఉన్న యాదవ నేతలు, బయటి వారు ప్రయత్నాలు చేశారు. కానీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జైపాల్ యాదవ్ ను రాజ్యసభకు పంపేందుకు కేసిఆర్ నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సీటు కోసం కరీంనగర్ జెడ్పీ అధ్యక్షురాలు తుల ఉమతోపాటు ఉద్యోగ సంఘాల నేత ఎంబి కృష్ణ యాదవ్, వరంగల్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్, నోముల నర్సింహ్మయ్య లాంటి నేతల పేర్లు కూడా వినిపించాయి. కల్వకుర్తి స్థానిక సమీకరణాలను సెట్ చేసే ఉద్దేశంతో జైపాల్ పేరు నిర్ణయించినట్లు చెబుతున్నారు.

ఇక మూడో సీటు విషయంలో ఇంకా కసరత్తు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఆ సీటును మహిళకు కేటాయించే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేదన్న విమర్శ ఉండగా తాజాగా మూడు సీట్లలో వన్ బై థర్డ్ కోటా కింద మహిళకు ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. సామాజిక కుల సమీకరణాలను కూడా దృష్టిలో ఉంచుకుని మూడో సీటును ఖరారు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మహిళా అభ్యర్థులు ఆ పార్టీకి చిక్కకపోతే ఎస్సీ, లేదా ఎస్టీ, లేదా మైనార్టీ వర్గాలకు చాన్స్ ఇవ్వొచ్చని చెబుతున్నారు. లేదంటే ఈ వర్గాల నుంచే మహిళకు ఇచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు.

సంతోష విషయంలో ఆశ్చర్యం

సంతోష్ కు రాజ్యసభ సీటు కేటాయించే విషయంలో టిఆర్ఎస్ శ్రేణుల్లో సర్వత్రా ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ‘‘సంతన్న పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నడు.. టిఆర్ఎస్ లో ఏ కార్యకర్తకు కష్టమొచ్చినా మొదట కలిసే మనిషి సంతన్న.. అటువంటి మనిషికి రాజ్యసభ ఇస్తే తప్పేంది? ఉద్యమంతో సంబంధం లేకుండా  బంగారు తెలంగాణ కోసం ఊడిపడ్డోళ్లకు కూడా పదవులు ఇస్తుంటే సంతన్నకు ఇవ్వడ న్యాయం. ఈ నిర్ణయం పార్టీ కోసం పనిచేసే వాళ్లందరికీ ఆక్సిజన ఇచ్చే పని’’ అని ఒక కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన యువనేత ఏషియానెట్ కు చెప్పారు. పార్టీలో ఎవరినడిగినా.. సంతోష్ విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. బిటి బ్యాచ్ కు ఇచ్చేకంటే సంతోష్ ఇవ్వడం న్యాయం అంటున్నారు.

జాతీయ ప్రంట్ రాజకీయాలకు టిఆర్ఎస్ తెర లేపడంతో కేసిఆర్ కు నమ్మదగిన వ్యక్తి ఢిల్లీలో ఉండడం కూడా అవసరమే అంటున్నారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో సంప్రదింపులు జరిపేందుకు సంతోష్ లాంటి వ్యక్తి సర్వీస్ పనికొస్తుందని చెబుతున్నారు. కేసిఆర్ తో సహా ఆయన ఫ్యామిలీలో ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్న కేటిఆర్, కవిత, హరీష్ రావు రాష్ట్ర రాజకీయాలపైనే కేంద్రీకరించారు. కవిత ఎంపి అయినప్పటికీ ఆమె లోకల్ రాజకీయాలపైనే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో రాజధాని ఢిల్లీలో సంతోష్ అనివార్యత ఏర్పడిందన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పైగా మూడు సీట్లు ఉన్నాయి కాబట్టి అందులో సంతోష్ కుమార్ కు ఒకటి ఇవ్వడంలో తప్పేంటని కేడర్ అంటున్నారు.

అయితే సంతోష్ కు సీటు ఇవ్వడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుపడుతోంది. ఈ విషయం టిఆర్ఎస్ పార్టీ వ్యవహారమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ దుమారం రేపే ప్రయత్నం చేస్తోందన్న విమర్శ ఉంది. అమర వీరుల కుటుంబానికి ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలని, సంతోష్ కుమార్ ఏం చేశాడని రాజ్యసభ సీటు ఇస్తున్నారని నిలదీస్తోంది. ఇప్పటికే కేసిఆర్ కుటుంబానికే నాలుగు పదవులు ఉండగా ఐదో పదవి కట్టబెడతారా అని విపక్షాలు సెటైర్ వేస్తున్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios