స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం : 15 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది, ఘటనాస్థలికి తలసాని
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం ఘటన కలకలం రేపుతోంది . ఇప్పటి వరకు 15 మందిని కాపాడినట్లుగా తెలుస్తోంది.

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం ఘటన కలకలం రేపుతోంది. బట్టల దుకాణం, గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కాంప్లెక్స్‌లోని 7వ , 8వ అంతస్తులకు వ్యాపించాయి. దీంతో ఆ ఫ్లోర్‌లలో వున్న పలు కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు చిక్కుకుపోయారు. ఐదో అంతస్తు పూర్తిగా తగులబడిపోయింది. అక్కడ చిక్కుకున్న వారు సెల్‌ఫోన్‌లలో వున్న టార్చిలైట్ల సాయంతో రక్షించాల్సిందిగా ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే అప్పటికే అందులో వున్న వారందరినీ ఫైర్ సిబ్బంది కాపాడారు.
ఇప్పటి వరకు 15 మందిని కాపాడినట్లుగా తెలుస్తోంది. ఇంకా లోపల ఎవరైనా ఉన్నారేమోనన్న కోణంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు.. అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడారు. లోపల చిక్కుకున్న వారిని తక్షణం కాపాడాలని అధికారులను ఆదేశించారు. డీఆర్ఎఫ్ టీమ్‌లు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజిన్లను తెప్పిస్తున్నారు. మరికొద్దిగంటలు శ్రమిస్తే కానీ మంటలు అదుపులోకి వచ్చే పరిస్ధితులు కనిపించడం లేదు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.