హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో గత కొద్ది రోజులుగా శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ చేస్తున్న వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ తిరుగుబాటు జెండా ఎగురేశారు. 

ప్రముఖ తెలుగు టీవీ చానెల్ సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తీరును తప్పు పట్టారు. టీఆర్ఎస్ లో ఉద్యమకారులను కలుపుకుని పోవడం లేదని ఆయన విమర్శించారు. ఉద్యమంలో తమను హేళన చేసినవారికి పార్టీలో గుర్తింపు ఇస్తున్నట్లు విమర్శించారు. 

Also Read: టీఆర్ఎస్ కు షాక్: రేవంత్ రెడ్డిపై స్వామి గౌడ్ ప్రశంసల జల్లు

అపాయింట్ మెంట్ కోరినా కేసీఆర్ ఇవ్వడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యమ కాలంలో వెన్నంటి నడిచిన ఉద్యమకారులకు కూడా సమయం ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారని ప్రశ్నిస్తూ కేసీఆర్ తీరును తప్పు పట్టారు. అయితే, అదే సమయంలో తాను పార్టీ మారే ప్రసక్తి లేదని, పార్టీలోనే ఉంటానని చెప్పారు. 

తమకు పదవులు ముఖ్యం కాదని స్వామి గౌడ్ అన్నారు. ఉద్యమకారులను, బడుగు బలహీనవర్గాలను కూర్చోబెట్టి మాట్లాడాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. తనకు చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, అయితే ఏ విధమైన పరిస్థితులు వచ్చాయో తెలియదు గానీ తనకు టికెట్ ఇవ్వలేదని ఆయన అన్నారు.

Also Read: ఉద్యమ కారులను పట్టించుకోవడం లేదు: టీఆర్ఎస్‌పై స్వామిగౌడ్ సంచలనం

కేసీఆర్ అంటేనే  ఒంటికాలి మీద లేచే కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ప్రశంసించి సంచలనం సృష్టించిన స్వామి గౌడ్ తాజా వ్యాఖ్యల ద్వారా మరింత కలకలం సృష్టించారు.