హైదరాబాద్: కాంగ్రెసు నేత, పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ప్రశంసల జల్లు కురిపించారు, ఇంతకు ముందు కుల రాజకీయాల గురించి మాట్లాడిన ఆయన తాజాగా రేవంత్ రెడ్డిని ప్రశంసించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

రేవంత్ రెడ్డి పుట్టింది రెడ్డి సామాజిక వర్గంలోనే అయినా బడుగు వర్గాలకు చేతికర్రగా మారారాని స్వామి గౌడ్ అన్నారీు. బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలిచినవారిని మనం గుర్తించి, వారికి అండగా నిలవాలని ఆయన అన్నారు. తెల్లబట్టల వాళ్లకు మనం అమ్ముడు పోవద్దని ఆయన అన్నారు. హైదరాబాదులని బోయిన్ పల్లిలో జరిగిన సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ సభలో స్వామి గౌడ్ ఆదివారం మాట్లాడారు.

రూ.2500 కోట్లు ఉన్న వ్యక్తిని ఒక పార్టీ నిలబెడితే రూ.3500 కోట్లు ఉన్న మరో వ్యక్తిని మరో పార్టీ నిలబెడుతోందని ఆయన అన్నారు. ఒక పార్టీ పది మందిని చంపినోడిని నిలబెడితే మరో పార్టీ 15 మందిని చంపినోడిని నిలబెడుతోందని ఆయన అన్నారు. ఇటువంటి రాజకీయాలను మనం గుర్తించాలని, చైతన్యం కావాలని ఆయన అన్నారు. 

యువత రాజకీయాల్లోకి రావాలని, కొత్త రాజకీయాలకు రూపుకల్పన చేయాలని, అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందని స్వామి గౌడ్ అన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీతో విభేదాల కారణంగానే స్వామి గౌడ్ అలా మాట్లాడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.