తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో భార్యాభర్తలను చెట్టుకు వేలాడదీసి, తీవ్రంగా కొట్టిన ఘటన వెలుగు చూసింది. చేతబడి అనుమానంతో గ్రామస్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. 

సంగారెడ్డి : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. చేతబడి, మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఓ జంటను చెట్టుకు వేలాడదీశారు గ్రామస్తులు. ఆ తరువాత తీవ్రంగా కర్రలతో కొట్టారు. 

శ్యామమ్మ, యాదయ్య అనే భార్యభర్తలను చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో గ్రామస్తులు కొట్టారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని కొల్కూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇది కొంతమంది వీడియో తీశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. 

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దంపతులను గ్రామస్తుల నుంచి కాపాడి.. కట్లువిప్పి.. చెట్టుమీదినుంచి దించారు. దంపతులకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

కేవలం తుమ్మినందుకే ఇంత దారుణమా... వీళ్లసలు మనుషులేనా..!

ఇదిలా ఉండగా, సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సంతోషంగా ఇంట్లో పండుగ చేసుకుంటున్న వారిని బయటికి పిలిచి మరీ కత్తులు, గొడ్డలితో దాడి చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

హత్యకు కారణం భూతగాదాలు కానీ, చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో కానీ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతులు మిడియం లక్ష్మయ్య(56), సింగమ్మ (52)లుగా గుర్తించారు. ఈ దంపతులిద్దరూ ఊర్లో వ్యవసాయం చేస్తుంటారు. గ్రామంలో కొందరితో వీరికి భూగతాదాలు కూడా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వీరింటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. 

లక్ష్మయ్యను బయటికి పిలిచారు. లక్ష్మయ్య ఇంటి బయటకు వచ్చి వారితో మాట్లాడి.. తిరిగి లోపలికి వెళుతుండగా అతని తల మీద గొడ్డలితో వేటు వేశారు. తర్వాత కర్రలతో గట్టిగా కొట్టారు. దీంతో లక్ష్మయ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే పడిపోయాడు. అర్ధరాత్రి ఇంటికి మనుషులు రావడం.. భర్తను బయటికి పిలవడంతో మేల్కొన్న సింగమ్మ.. భర్త మీద దాడిని చూసి కాపాడేందుకు బయటకు వచ్చింది.. నిందితులకు అడ్డుపడింది.. దీంతో వారు ఆమె తలపై కూడా బలంగా కొట్టారు. ఆమె కూడా అక్కడే కుప్పకూలిపోయింది.

ఆ తర్వాత దుండగులు భార్యాభర్తలు ఇద్దరిపై అతి క్రూరంగా దాడి చేశారు. ముఖం, తలా, ఒంటిపై విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో వారింట్లో మరొకరు కూడా ఉన్నారని తెలుస్తోంది. శాంతి అనే వారి కోడలు ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. దాడి జరిగిన తర్వాత తెల్లవారాక ఈ విషయాన్ని పోలీసులకు, గ్రామస్తులకు ఆమె తెలిపింది. ఈ దాడి వెనుక కారణాల అన్వేషణలో భాగంగా ఈ దంపతులకు గ్రామంలో కొందరితో భూతగాదాలు ఉన్నాయని తెలిసింది. లక్ష్మయ్య చేతబడులు కూడా చేస్తారని గ్రామంలో కొంతమంది నమ్ముతారని సమాచారం.