మూడనమ్మకాలను నమ్మి అనవసరంగా సాటి మనిషిని అత్యంత దారుణంగా చితకబాదింది ఓ కుటుంబం. ఈ అమానుషం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

ఖమ్మం : బయటకు వెళుతుండగా ఎవరైనా తుమ్మినా, పిల్లి అడ్డంవచ్చినా కొందరు అపశకునంగా భావిస్తుంటారు. ఈ పరిస్థితి ఎదురైతే కొద్దిసేపు అక్కడే ఆగి వెళుతుంటారు. కానీ ఖమ్మం జిల్లాలో ఓ కుటుంబం శుభకార్యానికి వెళుతుండగా తుమ్మాడని ఓ వ్యక్తికి అతి దారుణంగా చితకబాదారు. మూడనమ్మకాలను నమ్మి సాటి మనిషిని చితకబాదిన సదరు కుటుంబం మొత్తంపై పోలీసులు కేసులు కేసు నమోదు చేసారు. 

వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లి గ్రామానికి చెందిన బొందెల సత్యనారాయణ కుటుంబంతో కలిసి ఓ శుభకార్యానికి బయలుదేరాడు.వీరు ఇంటివద్ద కారెక్కి ముందుకు రాగానే అదే వీధిలో వుండే వీరభద్రం తుమ్మాడు. సాధారణంగానే అతడు తుమ్మినా కావాలనే తాము వెళుతున్నపుడే తుమ్మాడని సత్యనారాయణ కుటుంబం వీరభద్రంతో గొడవకు దిగింది. శుభకార్యానికి వెళుతున్నామని తెలిసే అపశకునంగా తుమ్మాడంటూ సత్యనారాయణ కుటుంబం వీరభద్రంను అసభ్య పదజాలంతో దూషించింది. ఇరుగుపొరుగువారు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

ఈ నెల 13న ఈ ఘటన జరగ్గా వీరభద్రం గ్రామపెద్దలను ఆశ్రయించాడు. దీంతో 15న గ్రామంలో పంచాయితీ నిర్వహించగా పెద్దలందరి ముందే సత్యనారాయణ దంపతులు, వారి ఇద్దరు కొడుకులు వీరభద్రంను పట్టుకుని చితకబాదారు. ఏం తప్పు చేసాడని కొడుతున్నారు... దయచేసి వదిలిపెట్టాలని వీరభద్రం కుటుంబం వేడుకున్నా వదిలిపెట్టలేదు. విచక్షణారహితంగా అతడిపై దాడి చేసి గాయపర్చారు. 

Read More వివాహేతర సంబంధానికి అడ్డుచెప్పాడని భర్తను హత్య చేసిన భార్య.. జీవిత ఖైదు విధించిన ఎల్బీనగర్ కోర్టు

తనపై జరిగిన దాడిపై వీరభద్రం పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అకారణంగా తనను దూషించడమే కాదు చితకబాదారని పోలీసులకు తెలిపాడు. దీంతో సత్యనారాయణతో పాటు భార్య, ఇద్దరు కొడుకులపై కేసు నమోదు చేసారు పోలీసులు. ఈ దాడి ఘటనపై దర్యాప్తు చేపట్టామని... నిజానిజాలు తేల్చి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.