హుజురాబాద్‌లో ఈటలదే గెలుపు.. సర్వేల నివేదిక ఇదే: బండి సంజయ్
హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలవబోతున్నారని సర్వే రిపోర్టులు వచ్చాయని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలిపారు. ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. సమావేశానంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.... ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన రోజే అమిత్ షాను కలుద్దామనుకున్నామన్నారు. అయితే ఆరోజు కుదరకపోవడం వల్ల సమయం తీసుకుని ఈరోజు ఢిల్లీకి వచ్చి కలిశామని వెల్లడించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలవబోతున్నారని సర్వే రిపోర్టులు వచ్చాయని సంజయ్ తెలిపారు.
Also Read:అమిత్‌షాతో నేడు భేటీ కానున్న బండి సంజయ్, ఈటల: హుజూరాబాద్ ఉప ఎన్నికపై చర్చ
తెలంగాణలో నిర్వహించబోయే బహిరంగసభకు వస్తానని అమిత్ షా తమతో చెప్పారని బండి సంజయ్ వెల్లడించారు. అదే విధంగా తాము చేపట్టబోతున్న పాదయాత్రకు కూడా ఆయనను ఆహ్వానించామన్నారు. ఆగస్టు 9వ తేదీన తమ పాదయాత్ర ప్రారంభమవుతుందని సంజయ్ పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉపఎన్నిక గురించి టీఆర్ఎస్ భయపడుతోందని... వారికి ప్రస్తుతం అభ్యర్థి కూడా దొరకడం లేదని సంజయ్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా ఓటర్లు తీసుకోవాలని... ఎందుకంటే వాళ్లు పంచేది అవినీతి సొమ్మంటూ దుయ్యబట్టారు. తెలంగాణలో అవినీతి, అరాచక, అక్రమ పాలనను అంతం చేయడానికే పాదయాత్రను చేపడుతున్నట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు.