అమిత్‌షాతో నేడు భేటీ కానున్న బండి సంజయ్, ఈటల: హుజూరాబాద్ ఉప ఎన్నికపై చర్చ
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ పావులు కదుపుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బండి సంజయ్ ఇవాళ భేటీ కానున్నారు. ఈటల రాజేందర్ కూడ ఈ భేటీలో పాల్గొంటారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చిస్తారు.
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం నాడు భేటీ కానున్నారు.ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర మంత్రి అమిత్ షా తో ఈటల రాజేందర్ తో కలిసి భేటీ కానున్నట్టుగా బండి సంజయ్ ప్రకటించారు.
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలపై కూడ కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చించనున్నారు. మరో వైపు తెలంగాణలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చిస్తామని బండి సంజయ్ ప్రకటించారు.హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.
ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్ బరిలోకి దిగనున్నారు. ఈటల రాజేందర్ గెలుపు కోసం ఆ పార్టీ యంత్రాంగం ఇప్పటి నుండే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈటల రాజేందర్ కూడ నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో మండలాలవారీగా బీజేపీ ఇంచార్జీలను నియమించింది.