ఢిల్లీ లిక్కర్ స్కాం:కవిత పిటిషన్ పై విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీం
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు తనను కార్యాలయానికి పిలిచి విచారణ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
న్యూఢిల్లీ: మహిళలను ఈడీ తమ కార్యాలయానికి పిలిచి విచారించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
కవిత పిటిషన్ పై ఇరువర్గాలు తమ వాదనలను విన్పించారు. మహిళలు ఎంపిక చేసుకున్న ప్రదేశంలోనే విచారణ చేయాలని కవిత తరపున న్యాయవాది వాదించారు. అయితే మనీలాండరింగ్ చట్టం కిందే కవితను విచారించినట్టుగా ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు విచారించారు. తమ కార్యాలయానికి పిలిపించి ఈడీ అధికారులు విచారించడాన్ని కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 23వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మార్చి మాసంలో మూడు దఫాలు ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. మార్చి 11, 20, 21 తేదీల్లో ఈడీ విచారణకు కవిత హాజరైన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ జరిగిందనే విషయమై కవితను విచారించినట్టుగా ఈడీ అధికారులు సుప్రీంకోర్టుకు తెలిపారు.ఈ పిటిషన్ పై విచారణను శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ సమయంలో ఈడీ అధికారులు తనపై తప్పుడు ప్రచారం చేశారని కూడ కవిత గతంలోనే ఆరోపణలు చేశారు. తాను ఫోన్లను ధ్వంసం చేసినట్టుగా ఈడీ అధికారులు చెప్పడాన్ని ఆమె తప్పబట్టారు. ఈడీ అధికారుల విచారణకు ఆమె తన ఫోన్లను తీసుకెళ్లిన విషయం తెలిసిందే.