Asianet News TeluguAsianet News Telugu

ఆ ఒక్క నిమిషం ఎవరిది..?

ఇంటర్‌ పరీక్షల్లో ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించం అనే నిబంధన విధించిన ప్రభుత్వం ఎవరి సమయాన్ని  ప్రామాణికంగా తీసుకుంటుందో చెప్పనే లేదు...?

students suffer with one minute late rule in inter exams

ఒక్క నిమిషం ... 365 రోజుల కష్టాన్ని బూడిద పాలు చేస్తోంది.  

 

ఒక్క నిమిషం.. ప్రభుత్వ అమానుషత్వాన్ని బయటపెడుతోంది.
 

ఒక్క నిమిషం ... విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోంది.

 

ఇంతకీ ఆ ఒక్క నిమిషం ఎవరిది ?... ఎవరి గడియారంలోనిది...?

 

ఇంటర్‌ పరీక్షల్లో ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించం అనే నిబంధన విధించిన ప్రభుత్వం ఏ గడియారాన్ని ప్రమాణికంగా తీసుకుంటుందో చెప్పనే లేదు...?


విద్యార్థుల గడియారాలనా... పరీక్ష కేంద్రంలోని అధికారుల గడియారాన్నా...?

 

అసలు అన్ని పరీక్ష సెంటర్లలో ఒకే టైం సూచించే గడియారాలున్నాయా...?

 

అసలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమయం అర సెకను కూడా తేడా లేకుండా ఉంటుందా...?

 

అసలు మన దేశంలో టైం కు రావడం అన్న అలవాటు ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఉందా..?

 

ఇక హైదరాబాద్ లాంటి మహానగరంలో ట్రాఫిక్ జాంలు , బస్సుల సమయ పాలన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉందా...?

 

ఏదీ సమయానికి రాని చోట ఆ ఒక్క నిమిషం నిబంధన విద్యార్థులకే ఎందుకు  పెట్టాలి...?

 

పరీక్ష కు ఓ విద్యార్థి నిమిషం ఆలస్యంగా వస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటీ...?

 

వీటిలో ఓ ఒక్క ప్రశ్నకు కూడా సర్కారు సరైన సమాధానం ఇవ్వగలదా...?

 

ఇప్పటికే ఒక్క నిమిషం నిబంధన వల్ల  రాష్ట్రంలో వందల మంది విద్యార్థులు పరీక్షకు దూరమయ్యారు.

 

 


హైదరాబాద్ లో ఒకే కళాశాలకు చెందిన 23 మంది విద్యార్థులు తమ తప్పు లేకపోయినా పరీక్ష రాయలేకపోయారు.

 

నిజాంపేట శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థులకు బాచుపల్లి శ్రీగాయత్రి కళాశాలలో పరీక్షా కేంద్రం పడింది.

 

కళాశాల యాజమాన్యం బస్సులో విద్యార్థులను సరైన సమయానికి తీసుకెళ్లలేక పోయింది. వాహనం చెడిపోతే దాన్ని బాగుచేసే పనిలో నిమగ్నమయ్యారే తప్ప ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో 23 మంది విద్యార్థులు కేంద్రానికి 10నిమిషాలు ఆలస్యంగా వెళ్లారు.

 

దిల్‌సుఖ్‌ నగర్‌లో మరో కళాశాల ఆధ్వర్యంలోని విద్యార్థులను వరుసగా ఉన్న పరీక్ష కేంద్రాల్లో దించుతూ వెళ్లి చివరిగా ఇద్దరు విద్యార్థులను నిర్ణీత సమయంలో చేర్చలేకపోయారు.

 

మరో ఇద్దరు వ్యక్తిగత ఆలస్యంతో కేంద్రంలోకి వెళ్లలేకపోయారు. పరీక్షలనే ఉద్దేశంతో వారు ఆరుగంటలకే కళాశాలకు చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది. అధికారులను ఎంత వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది.

 

ఇక మీడియా దృష్టికి రాకుండా నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్షకు దూరమైనవారెందరో ఉన్నారు.

 

పరీక్ష ఫీజుల చెల్లింపు నుంచి ఏగ్జామ్ సెంటర్ల ఏర్పాటు వరకు అన్నింటా నిర్లక్ష్యంగా వ్యవహరించే ఇంటర్ బోర్డు ఒక్క నిమిషం నిబంధన విషయంలో మాత్రం ప్రభుత్వ సూచనలను చాలా కచ్చితంగా పాటిస్తుండటం గమనార్హం.

 

ఒకే ఎంసెట్ పరీక్షను మూడు సార్లు నిర్వహించి విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఒక్క నిమిషం నిబంధనతో ఇంకా ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవాలనుకుంటుంది... పరీక్ష కేంద్ర వద్ద విలపిస్తున్న విద్యార్థుల ఆర్తనాదాలు కూడా సర్కారుకు కనిపించడం లేదా...?

 

Follow Us:
Download App:
  • android
  • ios