గ్రూప్-2 పరీక్ష వాయిదాకోరుతూ విద్యార్థుల ర్యాలీ, అరెస్ట్: ఓయూలో ఉద్రిక్తత
గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని ఓయూలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రూప్-2 పరీక్షలతో పాటు , గురుకుల పరీక్షలు కూడ విషయాన్ని విద్యార్థులు గుర్తు చేస్తున్నారు. ఒకే నెలలో రెండు పరీక్షలు నిర్వహించడంతో తమకు ఇబ్బందులు ఎదురౌతున్నాయని వారు చెప్పారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ సమయంలో పోలీసులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
టీఎస్పీఎస్సీ ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనుంది. గత ఏడాది డిసెంబర్ మాసంలో ఈ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. 783 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనుంది.
టీఎస్పీఎస్సీలో గతంలో నిర్వహించిన పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. ఈ విషయం ఈ ఏడాది మార్చి మాసంలో వెలుగు చూసింది. దీంతో కొన్ని పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. మరికొన్ని పరీక్షలను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఈ విషయమై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ ఇప్పటికే చార్జీషీట్ దాఖలు చేసింది. ఇప్పటికే 90 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. మరో వైపు ఈ కేసులో అనుబంధ చార్జీషీట్ దాఖలు చేయనున్నారు.