అంబర్ పేట లో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతిచెందిన హృదయవిదారక ఘటన మరిచిపోకముందే హైదరాబాద్ శివారులో మరో దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లాలోని జటాయువు ఫారెస్ట్ పార్క్ లో జింకను వీధికుక్కలు కొరికిచంపాయి.
హైదరాబాద్ : మనుషులనే కాదు వన్యప్రాణులను సైతం వీధికుక్కలు విడిచిపెట్టడం లేదు. హైదరాబాద్ అంబర్ పేటలో చిన్నారిపై కుక్కలు అత్యంత దారుణంగా దాడిచేసి చంపేసిన హృదయవిదారక ఘటన మరిచిపోకముందే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో బాలుడు కుక్కకాటుకు గురయ్యాడు. ఇలా వరుసగా వీధికుక్కల దాడి ఘటనలు వెలుగుచూస్తున్న క్రమంలోనే హైదరాబాద్ శివారులో వన్యప్రాణులపై కుక్కలు దాడి ఘటన బయటపడింది.
మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వతాపూర్ సమీపంలోని జటాయువు ఫారెస్ట్ పార్క్ లో వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోయింది. ఫారెస్ట్ అధికారుల నిత్యం పర్యవేక్షిస్తున్నా... వాకర్స్, సందర్శకులు ఇలా ఎప్పుడూ ఎవరో పార్క్ లో తిరుగుతూనే వున్నా అందరి కళ్ళుగప్పి అటవీ జంతువుల వేట సాగిస్తున్నారు వేటగాళ్ళు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఈ పార్క్ లో వీధికుక్కలు కూడా వన్యప్రాణుల వేట ప్రారంభించారు.
జటాయువు పార్క్ లో సంచరిస్తున్న ఓ జింక పిల్లపై వీధికుక్కలు దాడిచేసి చంపేసాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ జింక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. జింక మృతదేహాన్ని గుర్తించినవారు ఫారెస్ట్ అధికారులకు సమాచారమివ్వగా వారు ఘటనాస్థలికి చేరుకుని జింక మృతదేహాన్ని తరలించారు.
Read More హైద్రాబాద్ లో వీధికుక్కల స్వైరవిహారం: రాజేంద్రనగర్‌లో ఐదుగురిపై దాడి
చుట్టూ ప్రహారి నిర్మించిన పార్క్ లోకి వీధికుక్కలు ఎలా ప్రవేశించాయన్న దానిపై ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే పార్క్ కు ఆనుకుని వున్న సాయిప్రియా కాలనీవైపు ప్రహారి మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ దారిగుండానే కుక్కలు పార్క్ లోకి ప్రవేశించి వుంటాయని అధికారులు భావిస్తున్నాయి. కుక్కల దాడి ఘటనలో జింక మృతిచెందడాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Video అంబర్ పేట ఘటన మరువకముందే ... హాస్టల్లోకి చొరబడి విద్యార్థిపై దాడిచేసిన వీధికుక్కలు
ఈ జటాయువు పార్క్ లో కుందేళ్ల వేట కూడా కొనసాగుతుందని వాకర్స్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు కుందేళ్ల కోసం వేటగాళ్లు ఏర్పాటుచేసిన వలలను స్వయంగా తామే తొలగించామని... ఈ విషయాన్ని అనేకసార్లు పారెస్ట్ అధికారుల దృష్టికి కూడా తీసుకుని వెళ్లినట్లు వాకర్స్ చెబుతున్నారు. తాము ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు ఏకంగా వీధికుక్కలు ఓ జింక ప్రాణాన్ని బలితీసుకున్నాయంటూ వాకర్స్, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
