తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రంలో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేడు 60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజని...బంగారు తెలంగాణకు పునాది పడిన రోజు అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇక గాంధీ భవన్‌లో జరిగిన వేడుకల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆరు దశాబ్ధాల తెలంగాణ పోరాట యోధుల పోరాటం ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందన్నారు.

ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందో... వాటిని నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఉత్తమ్ విమర్శించారు.  అటు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. 

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు.