హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనూ సృష్టి ఆస్పత్రి ఎండీ నమ్రత మోసం వెలుగు చూసింది. హైదరాబాదులోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మీద దంపతులు ఫిర్యాదు చేశారు. సరోగాసి ద్వారా బిడ్డును కనిపించి ఇస్తానని తమను మోసం చేసిందని దంపతులు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విశాఖపట్నంలో నమ్రత అక్రమాల బాగోతం వెలుగు చూసిన విషయం తెలిసిందే. 

విశాఖలో చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నమ్రత ఆధ్వర్యంలో చిన్నపిల్లల అమ్మకాలు జరుగుతున్నట్టు గుర్తించారు. పిల్లలను పోషించే స్థితిలో లేని తల్లి దండ్రులను టార్గెట్ చేసి అమ్మకాలు చేస్తున్నట్టు తేలింది. తల్లి తండ్రులకు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి పుట్టిన తరవాత పిల్లలను తరలిస్తున్నట్టు గుర్తించారు. 

పిల్లలను అక్రమరవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇద్దరు ఆశావర్కర్లు వెంకటలక్ష్మి, అన్నపూర్ణ, డాక్టర్‌ తిరుమల ఈ ముఠాకు సహకరిస్తునట్టు గుర్తించారు. ఈ ఘటనపై విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా మీడియాతో మాట్లాడుతూ..పిల్లల అక్రమ రవాణా కేసులో యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండి నర్మత సహా ఆరుగుర్ని అరెస్ట్ చేశామన్నారు.

విశాఖలోని జడ్పీ జంక్షన్ వద్ద గల యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ కేంద్రంగా పిల్లల అక్రమ విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఠా ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులను కొనుగోలు చేసి అక్రమ రవాణా చేసినట్టు వెల్లడించారు.

తనపై పోలీసులు గాలిస్తున్న సమయంలోనే నమ్రత విశాఖపట్నం నుంచి విజయవాడ పారిపోయింది. పోలీసులు గుర్తించి విజయవాడకు వస్తున్నారని తెలిసి హైదరాబాదు వచ్చింది. ఆ తర్వాత కర్ణాటకకు పారిపోయింది. కర్ణాటకలో ఆమెను పోలీసులు అరెస్టు చేసి విశాఖకు తెచ్చారు.