ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు జీతంతో పాటు నగదు రూపంలో రూ.10 వేలు రూ.5 వేల కోట్ల చిన్న నోట్లు ఇవ్వాలని కేంద్రానికి నివేదిక ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందజేసే యోచన

పురుషులందు పుణ్యపురుషులు వేరన్నట్లు... ఉద్యోగులందు సర్కారు ఉద్యోగులు కూడా వేరే.. అసలు ప్రభుత్వం నడిచేదే వారి ద్వారా. అందుకే వారికి అన్ని చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు ఉండాల్సిందే.

ప్రభుత్వం కూడా ఈ దిశగా బాగానే చర్యలు చేపట్టింది. ఒక వైపు పెద్ద నోట్లు రద్దు నేపథ్యంలో పసిపిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు అందరూ పనులు మానుకొని బ్యాంకులు, ఏటిఎంల ముందు నిలబడ లేక నానా కష్టాలు పడుతున్నారు. పాపం కొందరు క్యూలోనే చనిపోతున్నారు.

దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ కష్టపడిపోతారో అని తెలంగాణ ప్రభుత్వం తెగ కంగారు పడిపోతోంది. వారు ఏటిఎంల ముందు క్యూలో నిలబడటం, బ్యాంకుల ముందు బార్లా తీరడం సర్కారుకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే వారు సర్కారు ఉద్యోగులు కదా.. అందుకే వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ నెల జీతం ఠంచనుగా అందించేందుకు నిర్ణయించింది.

అంతేనా... ఇచ్చే జీతంలో రూ. 10 వేలను చిల్లర నోట్లతో నగదు రూపంలో ఇవ్వాలని ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

అయితే చిల్లర కొరత రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. దీంతో హుటాహుటినా కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ కూడా రాశారు. రాష్ట్రానికి అర్జంటుగా రూ. 5 వేల కోట్ల చిన్న నోట్లను సరఫరా చేయాలని లేఖలో కోరారు.

ఇలా ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించడంపై సామాన్యులు మండి పడుతున్నారు. ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం, సర్కారు ఉద్యోగులు తమ సమస్యలను పట్టించుకోకుండా వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.