ఆకాశవీధిలో ఒకరు... నేలమ్మ ఒడిలో ఇంకొకరు : కేటీఆర్ కు సరికొత్తగా భర్త్ డే విషెస్
తమ అభిమాన నాయకుడు కేటీఆర్ కు బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కొందరు సరికొత్తగా భర్త్ డే విషెస్ చెబుతున్నారు.

హైదరాబాద్ : నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. దీంతో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ కు వివిధ రూపాల్లో భర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. కొందరు ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేస్తే మరికొందరు అన్నదానం, రక్తదానం, రోగులకు పండ్ల పంపిణీ వంటివి చేస్తూ పుట్టినరోజు వేడుక జరుపుతున్నారు. అయితే అందరిలా కాకుండా తమ అభిమాన నాయకుడికి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలని ఇంకొందరు భావించారు. అందుకే సరికొత్తగా ఆలోచించి కేటీఆర్ భర్త్ డే వేడుకలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేపట్టారు.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కు చెందిన మన్నెం రంజిత్ యాదవ్ ఇంగ్లాండ్ లో కేటీఆర్ భర్త్ డే వేడుకలు జరిపాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్లెక్సీలు ఏర్పాటుచేస్తే కిక్కు వుండదని అనుకున్నాడో ఏమో ఏకంగా ఆకాశవీధిలో కేటీఆర్ భర్త్ డే ప్లెక్సీలు ప్రదర్శించాడు. ఓ చాపర్ కు కేటీఆర్ ఫోటో, భర్త్ డే విషెస్ తో కూడిన భారీ ప్లెక్సీని వేలాడదీసి ఆకాశంలో చక్కర్లు కొట్టారు. ఇలా నాటింగ్ హామ్ లో కేటీఆర్ పుట్టినరోజు వేడుకను సరికొత్తగా నిర్వహించాడు రంజిత్ యాదవ్.
ఇక పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి కూడా వినూత్నంగా కేటీఆర్ కు భర్త్ విషెస్ తెలిపారు. తన స్వగ్రామం లింగాపూర్ లో వరినాట్ల కోసం ఏర్పాటుచేసిన మడిని అభిమాన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఉపయోగించారు జడ్పిటిసి. హ్యాపి భర్త్ డే కేటీఆర్ అంటూ వరినారుతో రాసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కూలీలతో కలిసి ఫోటో దిగిన జడ్పిటిసి వారికి స్వీట్స్ పంచిపెట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాగారంలో కూడా ఇలాగే వరినారుతో కేటీఆర్ కు భర్త్ డే విషెస్ తెలిపారు కొందరు మహిళలు.